People Media Factory: ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ (Telugu Cine Art Directors Association) విభాగంలో పని చేసిన సభ్యులపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆ మాటలను వెంటనే ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోషియేషన్ అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. ఇందులో
‘‘సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించే ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కీలకమనే విషయం తెలిసినదే. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపములో చూపించే మేధాసంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం. అంతటి విలువ కలిగిన విభాగంపై ఇటీవల ఓ మీడియా ఛానల్‌లో ‘ఆర్ట్ మాఫియా’ అంటూ వ్యాఖలు చేసిన పీపుల్ మీడియా నిర్మాత మాటలను ఆర్ట్ డైరెక్టర్స్ విభాగం తరుపున ఖండిస్తున్నాము.
Also Read- The Raja Saab: చిక్కుల్లో ‘ది రాజా సాబ్’.. ఇక విడుదల కష్టమే!
సినిమా ప్రారంభానికి ముందు, కథ తర్వాత అందుకు సంబంధించిన ప్రొడక్షన్ డిజైనర్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ డిజైన్స్ చేసిన తర్వాత సినిమాటోగ్రాఫర్లతో దర్శకుల సూచనలిస్తూ.. తాను అనుకుంటున్న సినిమా ఊహా రూపములో ఉన్నటువంటి అంశం, చర్చల అనంతరమే బడ్జెట్, సెట్ నిరాణం వంటి అంశాలు నిర్మాత దృష్టికి వెళతాయి. సెట్స్ నిర్మాణ సమయంలో డైరెక్టర్ కథాపరంగా చేర్పులు, మార్పులు గాని, ఇంకాస్త మంచి ఆలోచనలు వచ్చినప్పుడు సెట్స్‌లో కూడా మార్పులు చేయవలసి వచ్చింది. అలాంటి సమయంలో నిర్మాత అనుమతితోనే ఆ ఖర్చులు పెరుగుతాయి లేదంటే తగ్గుతాయి. ఈ విషయం సినిమా తీసే ఏ నిర్మాతకైనా అవగాహన ఉంటుంది. వారు (టీజీ విశ్వప్రసాద్) ఇటీవల కాలములో పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించారు, కల్పిస్తున్నారు. దానికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
కానీ ఈ విధంగా మీడియాలో మా (తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్) గురించి తప్పు మాట్లాడే సదరు నిర్మాత, తన సినిమాకు జరిగిన సదరు అంశముపై ఫిలింఛాంబర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? అక్కడ ప్రాక్టికల్‌గా ఏం జరిగిందో, ఆ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ పై కనీసం తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు తెలిపి, వివరణ తీసుకోవచ్చు. అలా చేయకుండా తనకు తానుగా మీడియా ముందు కళాదర్శకత్వ విభాగంపై అభాండాలు వేయడం ఒక దురభిప్రాయంగా అసోసియేషన్ భావిస్తోంది.
Also Read- Stray Dogs Row: సుప్రీంకోర్టు బయట కుక్కల పంచాయితీ.. డాగ్ లవర్ చెంప చెల్లుమనిపించిన లాయర్!
మద్రాసు నుంచి ఎన్నో ఇబ్బందులకు గురై మన తెలుగు గడ్డ మీద ఒక అంకితభావంతో, నిబద్ధతతో.. కుటుంబాలకు కూడా దూరమై సినిమాలకు పనిచేస్తున్నఎంతో మంది తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులను మాఫియాతో పోల్చడం సరైన పద్దతి కాదు. సెట్స్ నిర్మాణములో గతంలో లేనటువంటి కాంట్రాక్ట్స్ వ్యవస్థను ప్రోత్సహించడంవల్ల, వారి అవగాహన లోపాలవల్ల నష్టాలు జరుగుతున్నాయని సదరు నిర్మాత తెలుసుకోవాలి కోరుతున్నాం. సినీ పరిశ్రమ ఏర్పడిన తొలినాటి నుంచి, నేటి వరకు ఎంతో మంది ఆర్ట్ విభాగములో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన నిష్ణాతులైన ఆర్ట్ డైరెక్టర్స్ వున్నారు. ఆర్ట్ అన్నది ప్రొఫెషనల్‌గా చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న క్రాఫ్ట్. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో మారుతున్న ప్రస్తుత టెక్నాలజీని అనుసరించి.. మెంబర్స్‌కు స్కిల్స్ విషయంలోనూ, సినిమాల ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు తగు సూచనలు, నియమాల ద్వారా మెంబర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా సదరు నిర్మాతకు తెలియజేస్తున్నాం’’ అని అసోసియేషన్ పేర్కొంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
