Kamal Haasan: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హై-యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో టీమ్ అంతా పాల్గొంటూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళుతున్నారు. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా, చెన్నైలో ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read- Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?
ఈ సందర్భంగా లోక నాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ జర్నీలో నాతో పాటు కలిసి నడుస్తున్న వారెందరో ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నా గుండెల్లో ఎంతో కన్నీరుంది. అందులో నుంచి కొంత సంతోషం వస్తే.. కొంత బాధతో నిండి ఉంది. ఎంతో మంది, ఎన్నో తరాలుగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తప్ప నేను మరేం చెప్పలేను. నేను సినిమాకు పెద్ద అభిమానిని. ‘థగ్ లైఫ్’ సినిమా విషయానికి వస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది ఎ.ఆర్.రెహమాన్ గురించే. ఇళయరాజా తర్వాత సంగీతంతో నన్ను ముంచెత్తింది మాత్రం రెహమానే. వారిద్దరూ మన దక్షిణాది గర్వపడే గొప్ప కళాకారులని నేను చెబుతాను. వారి వయసు మనం లెక్కపెట్టలేం. నన్ను, మణిరత్నాన్ని కలిపింది సినిమానే. ప్రేక్షకులు మమ్మల్ని చూసి వేసే విజిల్స్ మాకోసమే కాదు.. సినిమా కోసం కూడా అని నాకు తెలుసు. నేను ఇక్కడున్నందుకు ఇప్పటికీ సంతోషపడుతున్నాను. సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ గొప్ప టెక్నీషియన్. ఆయన హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాల్సిన టెక్నీషియన్. ఆయనతో పని చేయటాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. అన్బరివు గొప్పగా యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు.
Also Read- Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!
ఇందులో నటించిన నటీనటులందరూ భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. శింబు మున్ముందు చేరుకునే స్థాయి ఏంటో నాకు తెలుస్తుంది. ఈ సమూహాన్ని ముందుకు నడిపే నాయకుడిగా శింబు ఎదుగుతాడని అనుకుంటున్నాను. ఆ బాధ్యత తనకుంది. త్రిష గురించి చెప్పాలంటే బాహ్య సౌందర్యమే కాదు.. మానసికంగా ఎంతో అందమైన అమ్మాయి. మరోవైపు జీవాగా నటించిన అభిరామి, చాలా గొప్పగా నటించారు. అశోక్ సెల్వన్‌ను చూస్తుంటే నాజర్‌ను చూస్తున్నట్లే అనిపించింది. నాజర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సినిమాను చూసేటప్పుడు అందరూ ఎంతగానో సంతోషిస్తారు. కానీ తీసేటప్పుడు మాత్రం చాలా సమస్యలను అధిగమించాలి. అలాంటి సమస్యలను నేను ఎన్నింటినో దాటి ఇక్కడికి వచ్చాను. అందుకు కారణం మాత్రం అభిమానులే. వారికి నేను ఎలా ధన్యవాదాలు చెప్పలో కూడా తెలియటం లేదు. అలాంటి వారి కోసమే నేను పాలిటిక్స్‌లోకి వచ్చాను. నేను ముఖ్యమంత్రి కావటానికో, ఎం.ఎల్.ఎ, ఎం.పి కావటానికో రాజకీయాల్లోకి రాలేదు. ఓ ఎం.ఎల్.ఎ ఏం చేస్తాడో దాన్ని తమిళనాడుకి మెల్లగా చేస్తున్నాం. నాతో పాటు ఉన్నవారందరూ ఇప్పుడు సమాజంలో పెద్దవారిగా ముందుకు నడుస్తున్నారు. అది నాకెంతో గర్వంగా ఉంది.
భవిష్యత్‌లో శింబు కూడా తన వారిని అలాగే ముందుకు తీసుకెళ్లాలి. నాజర్‌కు తమిళం అంటే, సినిమా అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. చిన్నసినిమాలు విజయం సాధించటానికి ఏం చేయాలనే దానిపై మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. జో జో జార్జ్ గురించి ముందు నాకసలు తెలియదు. తను నటించిన ‘రెట్టె’ అనే సినిమా చూశాను. చాలా గొప్పగా నటించాడు. నేను అసూయ పడే నటుల్లో తనొకడిగా మారిపోయాడు. చంద్రహాసన్ తర్వాత నాకు దొరికిన గొప్ప సపోర్ట్ మహేంద్రన్. ‘థగ్ లైఫ్’ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మినహా సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో అంతా అర్థం చేసుకోవచ్చు. సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్యూ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు