– ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్ర
– హైకోర్టులో ప్రస్తావించిన ఈడీ
– స్కాం వివరాలు ముందే తెలసని స్పష్టం
– అధికారిక నివాసంలో మీటింగ్
– కవిత టీం సభ్యుల్ని కలిసిన కేసీఆర్
– అన్నీ వివరించిన ఈడీ
– కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
– తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
Delhi Liquor Scam Case: ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతుండగా, ఇంకోవైపు ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విస్తుపోయే నిజాలను వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్రను వివరించింది. ఈ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి, రిటైల్ బిజినెస్ గురించి తండ్రి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పినట్టు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలియజేసింది. కవిత తన టీం సభ్యులను కేసీఆర్‌కు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో పరిచయం చేశారని వివరించింది. వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని తెలిపింది. మంగళవారం ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. సోమవారం కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా మంగళవారం సీబీఐ, ఈడీ వాదించాయి. మహిళ అనే ప్రత్యేక అంశం కింద బెయిల్ ఇవ్వాల్సిన అవసరం కవితకు లేదని, ఆమె చాలా శక్తివంతురాలని ఈ సందర్భంగా పేర్కొంది ఈడీ. విదేశాల్లో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేసిన ఆమె సాక్షులను బెదిరించిన తీరును చూస్తే ఎంతటి శక్తివంతురాలో ఇట్టే అర్థం అవుతుందని, అందుకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించినట్టు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కవితకు బెయిల్ ఇవ్వకూడదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశాయి. ఈడీ తరఫున వాదనలు వినిపించిన జోహెబ్ హుస్సేన్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని అన్నారు. ఈ కేసులో ఆమెది కీలక పాత్ర అని పేర్కొన్నారు. సంపాదించిన సొమ్ము అంతా నేరుగా కవితకు చేరినట్టు వాదించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇండియా అహెడ్ అనే చానెల్‌లో కవిత పెట్టుబడి పెట్టారని చెప్పారు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ డేటా ధ్వంసంపై సరైన సమాధానాలను కవిత ఇవ్వలేదని అన్నారు. కవిత అరెస్టు నిబంధనలకు, చట్టాలకు లోబడే జరిగిందని సీబీఐ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో వాదించారు. లిక్కర్ పాలసీ ద్వారా ఆమె లబ్ది పొందారని వివరించారు. ఈ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు ఈడీ, సీబీఐ సమర్పించాయి. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రస్తుతం కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని న్యాయవాది అన్నారు. కాబట్టి ఆమెకు బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అందులో కవిత పేరు లేదని, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పేరు ప్రస్తావించి, అంతా కవితనే చేశారని వాదిస్తున్నారని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. రేపు గానీ, ఎల్లుండి గానీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది.