world inequality lab report on india
Editorial

world inequality lab report : ఆర్థిక గణాంకాల వెనుక అసలైన నిజాలు

: ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం, ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తి, పెరుగుతోన్న జీడీపీ, తగ్గుతోన్న పేదరికం, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, పురోగమనంలో వృద్ధి రేటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, బిలియనీర్ల సంఖ్య, ఎంతో సానుకూలత ధ్వనించే ఈ పదాలను మనం రోజూ కొందరు నేతల ప్రసంగాల్లో తరచూ వింటున్నాం. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపేనని, దేశపు వనరులన్నీ క్రమంగా కొందరి సంపదకు ముడిసరకుగా మారిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడక తప్పదని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ‘వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌’ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారాల ప్రాతిపదికన హెచ్చరిస్తోంది. అయితే, బతుకు బండిని నెట్టుకొచ్చేందుకు రోజుకో తీరున పోరాటం చేసే సగటు జీవి దృష్టికి ఈ గణాంకాలేవీ రాకుండా చేయగల ఆకర్షణీయ, ఉద్వేగ భరితమైన ప్రచారంలో నేడు దేశం మునిగిపోతోంది.

భారత్ శరవేగంతో సాగిపోతోందనే ప్రచారం తారస్థాయికి చేరుతున్న ఈ సందర్భంలో ఇదంతా అంకెల గారడీయేనని, గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా పేదలకు, పెద్దలకు మధ్య అంతరం పెరిగిందని ‘వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌’ తాజా నివేదిక వెల్లడించింది. నోబెల్ పురస్కార స్వీకర్త థామస్‌ పికెట్టీతో పాటు ప్రసిద్ధ ఆర్థికవేత్తలైన నితిన్‌ కుమార్‌ భారతి, లూకస్‌ ఛాన్సెల్‌, అన్మోల్‌ సోమంచి బృందం సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించింది. ‘భారత్ ఆదాయం, సంపదల్లో అసమానత 1922 – 2023: బిలియనీర్ల దేశంగా ఆవిర్భావం’ అనే ఈ శీర్షికతో విడుదలైన ఈ పత్రం రూపకల్పనకు 2014- 2023 మధ్యకాలంలోని గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. దేశంలో 2000ల నుంచి ఊహించనంతగా ఆర్థిక అసమానతలు పెరిగాయని, కేవలం ఒకశాతం సంపన్నుల వద్దే 40 శాతం సంపద పోగుపడిందని నివేదిక లెక్కతేల్చింది. దేశంలోని మొత్తం ఆదాయంలో 22.6 శాతం ఒక్కశాతం సంపన్నుల సంస్థలకే చేరుతోందని, ఇందులో సగం జనాభాకు మాత్రం దక్కే ఆదాయపు వాటా కేవలం 15 శాతమేనని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలను కొలవడానికి ప్రమాణంగా వాడే ‘గిని కో-ఎఫిషియంట్‌’ మనదేశంలో 2000 సంవత్సరంలో 74.7గా ఉండగా, అది 82.3కి పెరిగిందని, కనుక భారత్‌ను ‘అత్యంత సంపన్నులున్న పేద దేశం భారత్‌’‌గా చెప్పటం అతిశయోక్తి కాబోదని నివేదిక పేర్కొంది. 2021లో జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక్క శాతం మంది చేతిలోకి వెళ్లిందని తేల్చింది. 1922లో దేశంలోని 1 శాతం సంపన్నుల చేతిలో 1.3 శాతం జాతీయ ఆదాయం ఉండగా, 1982 నాటికి అది 6.1 శాతానికి, 2022 నాటికి అది రికార్డు స్థాయిలో 22.6 శాతానికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఫోర్బ్స్‌ బిలియనీర్‌ ర్యాంకింగులను కూడా ఈ నివేదిక ఉటంకించింది. 1991లో రూ.100 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద గల భారతీయుల సంఖ్య 1 కాగా, 2022 నాటికి వారి సంఖ్య 162కు పెరిగిందనీ, ఇదే కాలంలో ఈ వ్యక్తుల మొత్తం నికర సంపద దేశ నికర జాతీయాదాయంలో 1 శాతం నుండి 25 శాతానికి పెరిగిందని గణాంకాలతో వివరించింది. భారత్‌లో ప్రభుత్వ గణాంకాల నాణ్యత తక్కువనీ, క్షేత్ర స్ధాయి గణాంకాల ప్రాతిపదికన చూస్తే తమ నివేదికలో పేర్కొన్న దానికంటే ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండొచ్చనీ నివేదిక అభిప్రాయపడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో కంటే నేటి భారతంలో ఆర్థిక అంతరం పెరిగిందనీ, దురదృష్టవశాత్తూ ఇది గతంలో దేశాన్ని పాలించిన బ్రిటిషర్ల సమయం కంటే ఎక్కువగా ఉందని విచారించింది.

33.2 కోట్ల జనాభా గల అమెరికాలో 60 శాతం ప్రజలు పన్ను చెల్లిస్తుండగా, 144 కోట్ల భారతీయుల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.24 కోట్లేనని, పన్ను ఎగవేతదారులను పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థను పునర్వవస్థీకరించాలని నివేదిక సూచించింది. అదే సమయంలో వ్యవస్థీకృతమైన సంపన్న కుటుంబాల నికర సంపదపై 2 శాతం సూపర్ ట్యాక్స్ విధించాలని నివేదిక అభిప్రాయపడింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలో ప్రభుత్వ పెట్టుబడులు పేద, మధ్యతరగతిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి తప్ప సంపన్నుల కోసం ఉండరాదని హితవు పలికింది. దేశంలోని రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులనూ బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధికంగా పేదలున్న రాష్ట్రం బీహార్ 51.91 శాతం కాగా, అతి తక్కువ పేదలున్న రాష్ట్రంగా కేరళ (0.71 శాతం) నిలిచింది. పేదల జాబితాలో రెండవ స్థానంలో జార్ఖండ్ (42.16 శాతం), మూడవ స్థానంలో యూపీ (32.67 శాతం) నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 13.74 శాతం పేదలతో తెలంగాణ జాబితాలో 18వ స్థానంలో నిలవగా, 12.31 శాతం పేదలతో ఏపీ 20వ స్థానంలో ఉంది. పోషకాహార లోపంతో బాధపడేవారు తెలంగాణలో 31.10 శాతం శాతం ఉండగా, ఏపీలో వీరు 26.38 శాతంగా ఉన్నారు. ‘దేశాన్ని అభివృద్ధి చేస్తామని, ఆర్థిక సంస్కరణలు చేపడతామని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే రెండు దఫాల పాలనలో అధికారం ఒకేచోట కేంద్రీకృతం కావటంతో సంపన్నులు, ప్రభుత్వం మధ్య సంబంధాలు బలపడ్డాయి’ అని నివేదిక విచారం వ్యక్తం చేసింది. అసమానతలను పూర్తిగా నివారించటం కష్టమే అయినా, వాటిని తగ్గించేందుకు నిరంతరం ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉండాలని, లేకుంటే పెరిగిన ఆర్థిక అసమానతలు సమాజంలో అశాంతికి బీజాలు వేస్తాయని ఈ నివేదికను రూపొందించిన ఆర్థిక వేత్తలు స్పష్టం చేశారు.

అయితే, ఆర్థిక అసమానతలను లెక్కించేందుకు ‘పికెట్టీ’ ఎంచుకున్న అధ్యయన విధానం పారదర్శకంగా లేదనీ, ముఖ్యంగా ఫోర్బ్స్ జాబితాను ప్రమాణంగా తీసుకోవటం అవాస్తవిక ధోరణిని సూచిస్తోందని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం భారత్‌లో వృద్ధిరేటును పెంచటం ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తూ వచ్చాయనీ, ఈ క్రమంలో అప్పటికే ఉన్న సంపన్న వర్గాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాయనీ, ఇదేమీ అవాంఛిత పరిణామం కాబోదని వారి వాదన. సంస్కరణల ఫలితాలు ఊపందుకునే క్రమంలో కొన్ని దశాబ్దాల పాటు ఆదాయ అసమానతలు కనిపించటం సహజమేనని, అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది జరిగిన పరిణామమేననీ, ఈ పాతికేళ్ల కాలంలో పేదల నుంచి దిగువ మధ్యతరగతికి చేరిన వారి సంఖ్యనూ చూడాలనీ, మధ్యతరగతి వేగంగా పెరిగిందనటానికి ఊపందుకున్న ఆర్థిక అభివృద్ధే నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ వాదనల సంగతి ఎలా ఉన్నప్పటికీ నెహ్రూ అవలంభించిన సోషలిజం, ఇందిర అమలు చేసిన మార్కెట్‌ సంస్కరణలు, రాజీవ్‌ తెచ్చిన ప్రైవేటీకరణ, పీవీ – మన్మోహన్‌ల ఆర్థిక సంస్కరణలు వారి కాలాల్లో దేశానికి అందిన విధానపరమైన ఆర్థిక నిర్ణయాలుగా నిలిచాయి. కానీ, 2014 నుంచి పూర్తి రాజకీయ స్థిరత్వం గల ఎన్డీయే కూటమి, ఈ పదేళ్ల కాలంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణమైన, పారదర్శకమైన తనదైన ఆధునిక ఆర్థిక విధానాన్ని దేశానికి అందించలేకపోయిందనే మాట సత్యదూరం కాదు. ప్రపంచపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ఆరాటపడుతున్న దేశంలో గుప్పెడు మంది దగ్గరే అవాంఛిత దామాషాలో జాతి సంపద పోగుపడుతుందనే మాటను మన నేతలు రాజకీయ విమర్శగా కొట్టిపారేసినా, నానాటికీ వేగంగా పేదరికంలోకి కూరుకుపోతున్న వారి ఆర్తనాదాలను కొట్టిపారేయటం మాత్రం అంత సులభం కాదు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు