The Survival Of Telangana Is An Urgent Need
Editorial

Telangana Existence: అస్తిత్వ పరిరక్షణే తెలంగాణ తక్షణావసరం

The Survival Of Telangana Is An Urgent Need: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గత దశాబ్దకాలంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న రాజముద్రలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులోని చారిత్రక కట్టడాల స్థానంలో అమరవీరుల స్థూపాన్ని చేర్చుతూ ఆయన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అస్తిత్వం బలంగా ప్రకటితమయ్యేందుకు గానూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటివరకు సూచిస్తూ ఉన్న టీఎస్ స్థానంలో టీజీని చేర్చటంతో బాటు ప్రజా గాయకుడు అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహంలోనూ కొన్ని మార్పులను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాగా, ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విపక్షాలతో బాటు కొందరు ఉద్యమకారులు తమ నిరసనను తెలిపారు. వీరి అభిప్రాయాలను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం వారి విమర్శలపై లోతైన చర్చ తర్వాతే… రాజముద్రపై అంతిమనిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వం చూపిన పరిణతి, ప్రజాస్వామిక భావనను మెచ్చుకుని తీరాల్సిందే.

ఇక.. రాజముద్ర విషయానికి వస్తే.. ఇందులోని చార్మినార్, కాకతీయ తోరణాలకు బదులు అమరవీరుల స్థూపాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వం ఎంపికచేసుకున్న అమరవీరుల స్థూపం తొలి, మలి దశ పోరాటాల్లో ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలకు ప్రతీక. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గతించిన చరిత్ర కంటే వర్తమానానికి ప్రాధాన్యం ఇచ్చిందనిపిస్తోంది. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో వారి స్మతులను శాశ్వతం చేయాలనే సంకల్పాన్ని ఈ మార్పు ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించటంతో బాటు తెలంగాణ అస్తిత్వానికి ఈ స్థూపాన్ని ఒక సూచికగా నిలపాలన్న సంకల్పం కూడా ప్రభుత్వ నిర్ణయంలో ఉందనిపిస్తోంది.

Also Read:తెలంగాణ అస్తిత్వ ప్రతీకలకు వందనం..

యువతరానికి తెలంగాణ అస్తిత్వమంటే కొందరు నేతలు, కొన్ని పార్టీలు గుర్తుకొస్తాయేమో గానీ, నిజానికి ఈ అస్తిత్వానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ జ్ఞాపకాలలో సమ్మక్క సారక్క తిరుగుబాటు, కొమరం భీం పోరాటం, స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జరిగిన సాయుధ పోరాటం సజీవంగానే ఉన్నాయి. దొడ్డి కొమురయ్య, ఐలమ్మ, బందగీ, షోయబుల్లా ఖాన్‌, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డిల స్ఫూర్తి తెలంగాణ చైతన్యంలో నేటికీ కనిపిస్తుంది. గతంలో అనేక ఉద్యమాల సందర్భంగా వచ్చిన సాహిత్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువులా పని చేసింది. స్వాతంత్య్రానంతరం ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగినా, వాటిలో అస్తిత్వపు ఉనికి ప్రధాన ఎజెండాగా జరిగిన పోరాటం మనదే. 1969లో 369 మంది పోలీస్ తూటాలకు బలికాగా, మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం 1200 మంది తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నారు. వీరి త్యాగాలకి, ఇక్కడి ప్రజల పోరాటాలకి, ఈ ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చోటు దక్కాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాజముద్రలో మార్పు చేర్పులకు ప్రయత్నించాము తప్ప ఇందులో ఎలాంటి స్వార్ధ ప్రయోజనాలు లేవని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కాకతీయుల కాలంలో గొప్ప పాలన జరిగినప్పటికీ, అద్భుతమైన కట్టడాలు ఉనికిలోకి వచ్చినప్పటికీ వారి ఆధిపత్యాన్ని నిలదీసిన అడవి బిడ్డలైన సమ్మక్క, సారక్కల మీద వారు చేసిన పోరాటంలో ఆధిపత్యం ఉందని, ఈ విషయంలో తానెప్పుడూ బలహీనులైన, స్వేచ్ఛను ఆకాంక్షించిన సమ్మక్క, సారక్కల పక్షానే నిలబడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆధిపత్యం కంటే ఆత్మత్యాగం గొప్పవనే భావన ఆయన మాటల్లో కనిపించింది. ఈ ఉదాత్తమైన ఆలోచన కూడా రాజముద్రలో తెలంగాణ అమరవీరుల స్థూపం స్థానం పొందేందుకు పరోక్షంగా దోహదపడింది.

రాజముద్ర, ప్రభుత్వ చిహ్నాల్లో మార్పులు మాత్రమే కాదు.. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ అస్తిత్వాన్ని బలపరచి, తర్వాతి తరాలకు అందించేందుకు ప్రభుత్వం చేయాల్సిన పనులూ కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలను మన అస్తిత్వానికి గౌరవప్రదమైన ప్రతీకలుగా నిలబెట్టాల్సి ఉంది. అలాగే, తెలంగాణ పౌరసమాజపు ఆకాంక్షలను, అభ్యంతరాలను ప్రభుత్వం పెద్దమనసుతో అర్థం చేసుకొని, వాటికి కనీస విలువను ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎందరో గొప్ప కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. వారి సేవలను తగిన విధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. భాషా పరంగా తెలుగు అకాడమీ, కళల పరంగా రవీంద్రభారతి వంటి సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఆర్థిక పరంగా నష్టపోతే తిరిగి మరో పదేళ్లలో కోలుకోవచ్చు. కానీ, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపును కోల్పోతే జాతి అస్తిత్వమే దెబ్బతింటుంది. కనుక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?