telangana politics and defections
Editorial

Politics: తెలంగాణలో రంగులు మారుతున్న రాజకీయం

Defections: రాజకీయాలు, పదవులు అంటే బాధ్యత. సేవ అనే దృక్పథం నుండి అవకాశం. కానీ, అధికారం అనే భావనగా నాయకుల వ్యవహార శైలి మారిపోయింది. రాష్ట్రం, పార్టీ అనే తేడా లేకుండా నాయకులు ఎక్కడ అధికారం, అవకాశాలు ఉంటే అక్కడికి మారిపోవటం, కండువాలు, పార్టీలు మార్చటం సర్వసాధారణమైపోయింది. ఒకనాడు సిద్ధాంతాలు, భావజాల ప్రాతిపదికన పార్టీలు నాయకులు, రాజకీయాలు చేస్తే, నేడు అధికారం, అవకాశాల కోసమే రాజకీయాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు, రాత్రికి రాత్రే కండువాలు మార్చడం పతనమైపోతున్న రాజకీయ విలువలకు అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలలో పార్టీలు మారే సంస్కృతి, ఫిరాయింపులు మరింత పెరిగినట్లుగా అనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఫిరాయింపుల సంస్కృతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందనే చెప్పాలి. 2014 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఐల నుండి దాదాపు 29 మంది శాసనసభ్యులు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అలాగే, 2018లో రెండో పర్యాయం జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ నుండి 13 మంది శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుండే 23 మంది శాసనసభ్యులు జంప్ అయ్యారు. దానివల్ల, ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అధికార బీఆర్ఎస్ లెజిస్లేటివ్‌లో విలీనం అవడమే కాకుండా, 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రతిపక్ష హోదాని సైతం కోల్పోవాల్సి వచ్చింది. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ నుండి బీజేపీ నుండి గెలిచిన శాసనసభ్యులు మాత్రమే పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు అనే విషయాన్ని కూడా గమనించాలి. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులే కాదు జంప్ అయిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కేటాయించడంతో దీన్ని తారస్థాయికి తీసుకెళ్లారనే చెప్పాలి. పార్టీ ఫిరాయింపులు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాలలో కూడా జరిగాయి. అలాగే, శాసన సభ్యుల ఫిరాయింపు వలన కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలే పడిపోయిన సందర్భాన్ని చూశాం.

ఒక దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. శాసనసభ ఎన్నికలలో ఓటమి, లోక్ సభ ఎన్నికలలో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోవడం, చేజారిపోతున్న క్యాడర్, పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో బీఆర్ఎస్ పార్టీ ఒకరకంగా అయోమయ స్థితిలో ఉందనే చెప్పాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించిన నేపథ్యంలో, ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్న తరహాలో అధికారం కోల్పోయిన తరువాత కారు దిగుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మరొక 20 మంది శాసనసభ్యులు కూడా కారు దిగటానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. 25 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతే ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి అనర్హత వేటు పడకుండా తప్పించుకోవటమే కాదు, బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని అధికారికంగా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేయటానికి అవకాశం దొరుకుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంచి అవకాశాలు పొందిన మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లే పార్టీ మారితే మిగతా శాసనసభ్యులు మారకుండా ఎలా ఉండగలుగుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో వరుస ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారిపోయింది. శాసనసభ ఎన్నికలలో 37 శాతం ఓట్లను సాధిస్తే, లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఓట్లు 17 శాతానికి పడిపోయాయి. ఒకవైపు ఆపార్టీ ఓట్లని బీజేపీ ఎగురేసుకుపోతుంటే, మరొకవైపు శాసన సభ్యులను కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోతోం ది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం లేకపోలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 32 జిల్లా పరిషత్‌లు గెలుచుకొని 13 మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచి తిరుగులేని పార్టీగా ఎదిగింది. కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రెండు జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ నలిగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

శాసనసభలో ప్రభుత్వ బలాన్ని పెంచటం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచటానికి కాంగ్రెస్ ద్విముఖ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడంలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అనూహ్యంగా ఎనిమిది మంది శాసనసభ్యుల బలమున్న బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 లోక్ సభ స్థానాలలో గెలవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడవేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడాలి కానీ, బీజేపీ బలం పుంజుకోకూడదనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కాబట్టి బీజేపీ బలంగా ఎదుగుతున్న ఉత్తర తెలంగాణలోనూ, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లోనూ, నగర శివారు ప్రాంతాలలోనూ వలసలను ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది. గత రెండు శాసనసభలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అవమానానికి బదులు తీర్చుకోవటంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ వైపునకు మళ్లకుండా వలసలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వలసలతో పార్టీలు బలం పెంచుకోవాలనే ఎత్తుగడ ఈ సందర్భంగా సక్సెస్ కాకపోవచ్చు. గత పది సంవత్సరాలలో 41 మంది శాసనసభ్యులను చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయింది. రెండు పర్యాయాలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అప్పటి అధికార పార్టీలో విలీనమై బలహీనపడినా, తిరిగి ఎలా పుంజుకొని గెలవగలిగింది. కాబట్టి వలసల ద్వారా తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు నెరవేరినా, పార్టీలు, ప్రభుత్వాలు బలపడాలంటే ప్రజలకు మంచి పాలన అందించాలి. ప్రజల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకు అవినీతి రహిత పారదర్శకమైన పాలన అందించాలి. ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో, ఒడిశాలో, తెలంగాణలో, కర్ణాటకలో, రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల అంచనాల మేరకు ప్రభుత్వాలు పనిచేయకపోవటం వలన ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీలు ఓటమి పాలైన విషయాన్ని గమనించాలి. పాలకులు, పాలనను, ప్రజలను గాలికి వదిలేసి రాజకీయాలలో మునిగి తేలితే ఆ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొక తప్పదు. ఉద్యమ నేపథ్యం గల రాష్ట్రంలో అధికార దాహ అవకాశవాద రాజకీయాలు రాష్ట్ర ప్రతిష్టనీ దెబ్బతిస్తాయి. వలసలు ఫిరాయింపుల విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు, లెజిస్లేటివ్ సంప్రదాయాలు పాటించినప్పుడే రాజకీయాలలో విలువలు పెరుగుతాయి. నాయకులు ప్రజలకు సేవ చేయగలుగుతారు.

డాక్టర్ తిరునాహరి శేషు
పొలిటికల్ ఎనలిస్ట్
కాకతీయ విశ్వవిద్యాలయం
9885465877

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?