Secrets Of Jawahar Lal Nehru
Editorial

నవ భారత నిర్మాత మీద నిందలా?

‘మన భారతదేశపు స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు ఎన్నటికీ అస్తమించకూడదు. రేపటి పట్ల మన ఆశ.. ఏనాటికీ నిరాశ కారాదు. మనం ఏ మతానికి చెందిన వారమైనా, సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. దేశ నిర్మాణం విషయంలో ఏనాటికీ మనం మత, సంకుచిత భావనలను ప్రోత్సహించకూడదు’. ఇవీ దేశ ప్రధానిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పిన మాటలు. కానీ, గత పదేళ్లుగా ఒక పథకం ప్రకారం నెహ్రూ పాలన, ఆయన వ్యక్తిగత జీవితం మీద తీవ్రమైన దాడి జరుగుతూ వస్తోంది. దీనికి కారణాలు, కారకులు, ఈ విద్వేష ధోరణితో వారు ఏమి పొందాలనుకుంటున్నారనేదీ అందిరికీ తెలిసిన విషయమే. అయితే, ఎవరెన్ని విమర్శలు చేసినా నెహ్రూ అనే నాయకుడు తన జీవిత కాలంలో ఈ దేశానికి చేసిన మేలు, ఆయా రంగాలపై ఆయన వేసిన ముద్ర 77 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత నేటికీ ఈ దేశంలో అడుగడుగునా దర్శనమిస్తూనే ఉంది.

నెహ్రూ వ్యక్తిత్వం, మేధస్సు, భవిష్యత్తు పట్ల ఆయనకున్న అపారమైన ఆశావాద దృక్పథం, మానవీయతల గురించి చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు మనమందున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగంలోని ప్రతి పదం ఆయనకు ఈ దేశ భవిష్యత్తు పట్ల ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను మనం ఇప్పుడు నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞానాన్ని మనంమంతా కలిసి పారద్రోలాలి. ప్రతి మనిషి కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి ఇక మనం నిరంతరం చిత్తశుద్ధితో పనిచేయాలి’ అంటూ ఆయన చేసిన ప్రసంగంలో స్వాతంత్ర పోరాటపు ఆకాంక్షలు, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగపు లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.

స్వరాజ్యం సిద్ధించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేస్తూ, లౌకిక వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేయటం ద్వారా దేశాన్ని మత మౌఢ్యం, దేశ విభజన గాయాల కలిగిన అసంతృప్తుల నుంచి అభివృద్ధి వైపు నడిపారు. సామాజిక న్యాయం, సామ్యవాద భావాలు వికసించడానికి నెహ్రూ కృషి చేశారు. మనదేశంతో బాటు స్వాతంత్ర్యం పొందిన ఇండోనేషియా, పాకిస్థాన్, అనేక ఆఫ్రికా దేశాలు అనేక దేశాలు అనతి కాలంలోనే నియంతృత్వం దిశగా అడుగులు వేయగా, నాటి నెహ్రూ విశాల దృక్పథం కారణంగానే నేడు మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలిచిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నిజానికి డచ్ పాలన నుంచి ఇండోనేషియా విముక్తికి పోరాడిన సుకర్ణో గొప్ప అభ్యుదయ వాది అయినప్పటికీ, అలీనోద్యమంలో నెహ్రూతో భుజం భుజం కలిపి నడిచినప్పటికీ అధికార వ్యామోహాన్ని పెంచుకుని, నియంతృత్వ పోకడలతో పతనమయ్యారు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని గొప్ప ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మన పొరుగుదేశపు చైనా నేత మావో జెడాంగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంస్కృతిక విప్లవం పేరుతో జనం మెదళ్లపైనా నిఘాపెట్టి లక్షల ప్రాణాలను బలిగొన్నారు. కానీ, నెహ్రూ తన రాజకీయ ప్రత్యర్థుల చేత కూడా ప్రశంశలు అందుకుని గొప్ప ప్రజాస్వామిక వాదిగా చరిత్ర సృష్టించారు.

నేడు కొందరు నెహ్రూ, పటేల్‌ ఆజన్మ శత్రువులన్నట్లుగా చెబుతున్నారు. నెహ్రూ విదేశీ విధానం లోప భూయిష్టమనీ, పటేల్ మాటను కాదని ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పే మాటలు అవాస్తవాలని పలు సందర్భాల్లో ఆయా నేతలు చెప్పిన మాటలే ఉదాహరణలు. కానీ, వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. పటేల్‌ను సంప్రదించకుండా, చూడకుండా తనకు రోజు గడిచేదే కాదని నెహ్రూ, నెహ్రూను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేదని పటేల్ చెప్పిన మాటలే ఇందుకు రుజువుగా ఉన్నాయి. నెహ్రూ విధానాలను వ్యతిరేకించిన రాజకీయ ప్రత్యర్థిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని.. నెహ్రూ అమితంగా అభిమానించిన సంగతీ నేటి నెహ్రూ విమర్శకులకు బహుశా తెలియకపోవచ్చు. ‘జనసంఘ్‌’ ఎంపీగా తొలిసారి ఎన్నికై లోక్‌సభకు వచ్చిన వాజ్‌పేయి తన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నప్పుడు నెహ్రూ ఏనాడూ అడ్డుచెప్పలేదు. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు ఏదో ఒకనాడు దేశ ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారు. 1977లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న వాజ్‌పేయి తొలి రోజు తన ఛాంబర్‌లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటో లేకపోవటంపై మండిపడి, అప్పటికప్పడు ఆ ఫోటో తెప్పించి అక్కడ పెట్టించిన సందర్భాన్ని స్వయంగా వాజ్‌పేయి పార్లమెంటులో చెప్పారు. 1947లో ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో కాంగ్రెస్ విధానాలను విమర్శించే అంబేద్కర్‌, జస్టిస్‌ పార్టీ నేత షణ్ముగం చెట్టి, హిందూ మహాసభ ప్రముఖుడు శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ, అకాలీదళ్‌ బల్దేవ్‌సింగ్‌ వంటి వారిని మంత్రులుగా నియమించి, వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే పాలన చేశారు. నెహ్రూ అసాధారణమైన వ్యక్తిత్వం కారణంగానే వారు ఆ ప్రభుత్వంలో చేరారని చెప్పవచ్చు.

సంప్రదాయ వాదులతో నిండిన నిండిన కాంగ్రెస్ పార్టీలోకి అభ్యుదయ భావాలున్న నేతలను ఆహ్వానించటం ద్వారా నెహ్రూ ఆ పార్టీకి నూతన జవసత్వాలను తెచ్చారు. అప్పటి వరకూ మనదేశానికి డొమినియన్‌ హోదా ఇస్తే చాలన్న సీనియర్ కాంగ్రెస్ నేతలతో నెహ్రూ విభేదించారు. 1929 డిసెంబర్‌లో జరిగిన ‘లాహోర్‌ కాంగ్రెస్‌ సభ’లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై, అదే వేదిక నుంచి దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాల్సిందేనని నినదించారు. మైనారిటీలకు, మహిళలకు సమాన హక్కులు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, దళితులకు రిజర్వేషన్లు వంటి క్లిష్టమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీలోని పాత నేతలను నెహ్రూ ఒప్పించగలిగారు. స్వాతంత్య్రానికి ముందే దేశ పునర్నిర్మాణంపై నెహ్రూకు ఒక అవగాహన ఉండేది. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశాన్ని అనతి కాలంలో ప్రగతి బాట పట్టించటానికి అతి తక్కువ సమయంలో ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయగలిగారు. తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్‌ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి వైద్యసంస్థలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో చదువుకున్న హోమీ జె.బాబా, విక్రమ్‌ సారాబాయ్, సీడీ దేశ్‌ముఖ్, భట్నాగర్ వంటి ఎందరో మేధావులను ప్రోత్సహించి, నేడు అంతరిక్ష రంగంలో మన దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్‌’ను ఏర్పాటు చేయించారు.

1952లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశ ప్రధాని కాగానే పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు. తొలి ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి, రెండవ ప్రణాళికా కాలంలో పరిశ్రమలకు పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచటం, జాతీయాదాయాన్ని 2 నుంచి 3 రెట్లు పెంచటం, ప్రతి వ్యక్తికి రోజుకు 2,400 నుంచి 2,800 కిలో క్యాలరీల ఆహారం అందాలనే లక్ష్యం, ఏడాదికి ఒక మనిషికి 30 గజాల బట్ట, 100 చదరపు అడుగుల ఇంటిస్థలం అందుబాటులోకి తేవటం, ఆహార, ముడిపదార్థాల స్వయంసమృద్ధి, గ్రామీణ మార్కెట్ల విస్తరణ, పరిశ్రమలకు ముడిసరుకు, శ్రామికుల సరఫరా, వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం, నిరక్షరాస్యత నిర్మూలన, అంటువ్యాధులపై యుద్ధం, నిరుద్యోగులకు ఉపాధి, కార్మికులకు మెరుగైన, పరిశుభ్ర పని వాతవరణం కల్పించటం, దేశంలో కొత్త యూనివర్సిటీల సంఖ్యను పెంచటం, కనీస వేతనాల అమలు, ప్రాంతీయ అసమానతలను తగ్గించటం వంటి లక్ష్యాల సాధనకు పంచవర్ష ప్రణాళికలు ఎంతగానో దోహదపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, లఘు, కుటీర పరిశ్రమల ఏర్పాటు, కీలక రంగాల్లో స్వయంసమృద్ధిని సాధిస్తూనే విదేశీ సాంకేతికత మీద ఆధారపడాలనే నియమం, స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ, వనరుల హేతుబద్ధ వినియోగం, భూసంస్కరణల అమలు దిశగా పంచ వర్ష ప్రణాళికలు దేశాన్ని నడిపించాయి. అయితే, సామ్యవాద భావాలకు చోటివ్వని మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ అనే కోరలు లేని పామును తీసుకురావటం దురదృష్టకరం. బ్రిటీష్‌ వారి పాలనలో దేశంలో ఒక్క శాతం వ్యక్తుల చేతిలో 21 శాతం జాతి సంపద ఉండగా, నెహ్రూ విధానాల ఫలితంగా అది 6 శాతానికి తగ్గింది. నేడు ఇప్పుడు మళ్లీ 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్‌రాజ్‌’ నుంచి ‘స్వరాజ్‌’ వైపు దేశాన్ని మళ్లించిన నెహ్రూ విధానాలను తూర్పారబట్టే నేటి నేతలు.. నేడు దేశాన్ని ‘బిలియనీర్ల రాజ్‌’ దిశగా అడుగులు వేయిస్తున్నారు.

జీవితాంతం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛా భావనలు, పేద, అణగారిన వర్గాల పట్ల సానుభూతి చూపిన జవహర్ లాల్ నెహ్రూ 1964 మే 27న తన 74వ ఏట పరమపదించారు. తన పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశ ప్రధానిగా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలనిచ్చిన మాట వాస్తవం. చైనా వంటి పొరుగుదేశాల విషయంలో ఆయన అంచనాలు తప్పిన మాట కూడా నిజమే. కానీ, మొత్తంగా చూసినప్పుడు ఆయన ఆధునిక భారత నిర్మాత కాదనలేని వాస్తవం. స్వాతంత్ర సమరయోధుడిగా, గొప్ప ఉదార వాదిగా, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పట్ల అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా, నవభారత నిర్మాతగా ఆయన వదిలి వెళ్లిన ముద్రను చెరిపేయటం ఆయనను పూర్వపక్షం చేస్తున్న కొందరు కొద్ది బుద్ధులున్న వ్యక్తులకు ఏనాటికీ సాధ్యం కాదు. ‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వే.. ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకమే’ అని నెహ్రూ పరమపదించినప్పుడు తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన కవితా పంక్తులే ఇందుకు రుజువు.

గోరంట్ల శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!