Salute To The Symbols Of Existence Of Telangana
Editorial

Telangana: తెలంగాణ అస్తిత్వ ప్రతీకలకు వందనం..

Salute To The Symbols Of Existence Of Telangana: రాజకీయాలలో ఆర్థిక రాజకీయ భావజాలానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ విలువ ఆ ప్రాంత అస్తిత్వాలకు ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు దేశానికి ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. అయిదు దశాబ్దాలకు పైగా తమిళ రాజకీయాలన్నీ అక్కడి భాష, సంస్కృతి, జీవవ విధానాల మీదనే ఆధారపడి సాగాయి. దీనికి తోడు అక్కడి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ద్రవిడ అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచిన సదరు నేతలను అక్కున చేర్చుకున్నారు. అక్కడ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరమున్నా.. అవి ద్రవిడవాదానికి ఒక్క అడుగు దూరం జరగలేని అనివార్య పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. మరోవైపు.. స్వపరిపాలన కోసం ఆరాటపడిన తెలంగాణ ప్రజలు రెండు దశల్లో ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమకాలంలో పలు రూపాల్లో కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు తెలంగాణ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగిన పాలనలో నాలుగైదేళ్లకే ఆ తెలంగాణ అస్తిత్వం నీరుగారిపోయింది. సబ్బండ వర్ణాల పోరాటాలు, అమరుల త్యాగాలు, మహనీయుల త్యాగాలు మరుగున పడి కేవలం ఒక కుటుంబమే తెలంగాణకు పర్యాయపదంగా మారటమే ఈ అస్తిత్వ విధ్వంసానికి కారణమైంది. ముఖ్యంగా నేటి యువతరానికి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచిన మహనీయులెవరో తెలియని దుస్థితి ఈ పదేళ్ల బీఆర్ఎప్ పాలనలో ఏర్పడింది. ఈ దశాబ్ది వేడుకల వేళ తెలంగాణ అస్తిత్వానికి సర్వం ధారబోసిన ఆ మహనీయులు, వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉవ్వెత్తున ఎగసిన 1969 జై తెలంగాణ ఉద్యమం తర్వాత సద్దుమణిగినా, ప్రజల మనసులో అది ఏదో ఒకరూపంలో వ్యక్తమవుతూ వచ్చింది. 1969 నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. ఆ పోరాటాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న తెలంగాణవాదులు తెలంగాణ అస్తిత్వవాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. నాడు జనంలో స్ఫూర్తిని వ్యాపింపజేసిన వారిలో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, తెలంగాణ ప్రభాకర్, సంతపురి రఘువీరరావు, ఇ.వి.పద్మనాభం, భూపతి కృష్ణమూర్తి, తోట ఆనందరావు, ప్రతాప్‌ కిషోర్, వెలిచాల జగపతిరావు, గద్దర్, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు. అయితే.. 1983లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధాన సభ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారందరినీ ఏకం చేసేందుకు తెలుగు జాతి అనే భావనను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దాని వల్ల తెలంగాణ అస్తిత్వవాదం దెబ్బతింటుందని తెలంగాణవాదులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా 1983 నుంచి తమ వాదాన్ని కాపాడుకోవడానికి కొందరు మేధావులు అనేక వేదికలపై తమ గొంతుకను వినిపించడం మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టటం కోసం ఎందరో నాయకులు సమితులు, పార్టీలు, ఫోరాలతో పోరాట స్ఫూర్తిని కొనసాగించారు. పత్రికలు పెట్టి ప్రచారం చేశారు. సభలు ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించారు. ట్రస్టులు స్థాపించి అసమానతలపై అధ్యయనాలు చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి వెళ్లి జాతీయస్థాయిలో వినతిపత్రాలను సమర్పించారు. పట్టు విడవకుండా పాదయాత్రలు నిర్వహించారు. తద్వారా మలిదశ ఉద్యమానికి గట్టి పునాదులు వేసి తెలంగాణ అస్తిత్వాన్ని తమ తర్వాతి తరాలవారికి భద్రంగా అందజేశారు.

ప్రముఖ తెలంగాణవాది, హైదరాబాద్‌ నగర సంస్థ మాజీ కౌన్సిలర్‌ ఇ.వి.పద్మనాభం ‘ఫ్లాష్‌ అండ్‌ ఫెల్లోమెన్‌’ అనే పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెచ్చారు. 1985లో ‘అడ్వైజర్‌’ పత్రిక సంపాదకుడైన సత్యనారాయణ…తెలంగాణ జనసభ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే ఏడాది ఫిబ్రవరి 27న ఆంధ్ర సార్వత్రిక పరిషత్తులో ఒక సదస్సు నిర్వహించింది. దీనికి ఆర్యసమాజ నాయకుడైన వందేమాతరం రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి, తెలంగాణవాదాన్ని ప్రచారం చేశారు. తెలంగాణ జనసభ ప్రతినిధుల బృందం నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించింది. అనంతరం ఇ.వి.పద్మనాభం ప్రభావంతో 1986లో టి.ప్రభాకర్‌ తన సహచరులైన ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌లను సంప్రదించి ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌’ను ప్రారంభించారు. ఈ సంస్థ 1956 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలపై కరపత్రాలుగా ముద్రించేది. సదస్సులు నిర్వహించి ప్రచారం చేసేది. సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి తెలంగాణ మేధావులతో కలిసి ప్రభాకర్‌ 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్టుగా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టులో టి.ప్రభాకర్, ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, పి.హరినాథ్, డాక్టర్‌ వినాయక్‌ రెడ్డి, తోట ఆనందరావు, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు. ట్రస్టు కార్యకలాపాలన్నీ టి.ప్రభాకర్‌కు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్, ఇంటి నుంచే జరిగేవి. తెలంగాణ కోసం చేసిన కృషి ఫలితంగానే ఆయన తెలంగాణ ప్రభాకర్‌గా ప్రసిద్ధిచెందారు. ఈ ట్రస్టు ప్రధాన లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ అసమానతలను అధ్యయనం చేసి వాటిని ప్రజలకు చేరవేసి చైతన్య పరచడమే. ఈ ట్రస్టు 1986, ఆగస్టు 13న ‘మా తెలంగాణ’ అనే పత్రికను ఆవిష్కరించింది. ఆ సందర్భంగా కాచిగూడలోని బసంత్‌ టాకీస్‌లో జరిగిన సభకు ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ అధ్యక్షత వహించగా, జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1988లో ట్రస్టు ప్రచురించిన ‘పర్స్పెక్టివ్స్‌ ఆన్‌ తెలంగాణ’ గ్రంథంలో తెలంగాణకు సాగునీరు, విద్యుత్తు రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సమగ్ర సమాచారంతో వివరించింది. సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ 1989 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కోస్తాలో గుడివాడ, రాయలసీమలో హిందూపురంలో గెలిచినా, తెలంగాణలోని కల్వకుర్తిలో ఓడటం వెనక తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్టు ఎన్నికల ప్రచారం కూడా ఉంది.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేత కె.మనోహర్‌రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక సంస్థను స్థాపించి, స్థానిక ఉద్యోగాల్లో స్థానికేతరులను నియమించడం, విశ్వవిద్యాలయంలో సీట్లను స్థానికేతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. ఇందులో చురుకుగా పాల్గొన్న నాటి జర్నలిస్టు జగన్‌రెడ్డి ‘కాకతి’ అనే పుస్తకాన్ని ప్రచురించి తెలంగాణవాదాన్ని ప్రచారం చేశాడు. తెలంగాణ ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ఆంధ్రుల నియామకాన్ని ప్రోత్సహించిన నాటి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మనోహర్‌రెడ్డి చేసిన ఆమరణ నిరాహార దీక్షకు స్పందించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సంస్థ బృందం దిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జాతీయ నాయకులకు వినతిపత్రాలను సమర్పించింది. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు కూడగట్టడానికి 1969 తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు అయిన ప్రతాప్‌ కిషోర్‌ తన మిత్రులైన షేర్‌ఖాన్, షాబుద్ధీన్‌లతో కలిసి 1987, జూన్‌ 6న హైదరాబాద్‌ నుంచి దిల్లీకి పాదయాత్ర చేపట్టారు. వీరు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై వినతి పత్రాలు ఇవ్వటమే గాక, తెలంగాణ ప్రజాసమితి అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ గాంధీగా పేరు పొందిన భూపతి కృష్ణమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1994, జనవరి 23న హైదరాబాద్‌లో జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నవంబరు 1ని తెలంగాణ బ్లాక్‌ డేగా, విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ ప్రజాసమితి 1996, నవంబరు 1న వరంగల్‌లో నిర్వహించిన సదస్సులో ప్రకటించింది.

వీరుగాక, వెలిచాల జగపతిరావు సాగునీరు, విద్యుత్తు రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలు ఉద్యమాల ద్వారా నిలదీశారు. ఇదే బాటలో తెలంగాణ జల సాధనా సమితి పేరుతో దుశ్చర్ల సత్యనారాయణ నల్గొండ ఫ్లోరైడ్ భాధితులకు సంఘీభావంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పాదయాత్ర చేశారు. ఓయూ ఫోరం ఫర్‌ తెలంగాణ పేరుతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చర్చించడానికి 1989లో ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ అధ్యక్షతన ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది వర్సిటీ కేంద్రంగా తెలంగాణ వాదాన్ని వినివిస్తూ వచ్చింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేతుల మీదుగా మొదటిసారిగా తెలంగాణ పొలిటికల్‌ మ్యాప్‌ను ఈ సంస్థ విడుదల చేసింది. 1989లో తెలంగాణ సంఘర్షణ సమితి పేరుతో మాచినేని కిషన్‌రావు, 1984లో దేవానంద స్వామి ప్రారంభించిన తెలంగాణ పార్టీ, ప్రొ. జయశంకర్ వంటి మేధావులు, జానారెడ్డి వంటి దిగ్గజ నేతలు కలిసి ప్రారంభించిన తెలంగాణ ఫోరం వంటి సంస్థలు దశాబ్దాల తరబడి తెలంగాణ అస్తిత్వ దీపాన్ని ఆరిపోకుండా నిలబెట్టాయి. ఈ విధంగా 1983 తర్వాత తెలంగాణ అస్తిత్వవాదాన్ని బలోపేతం చేయడానికి ఈ వేదికలన్నీ 2001 తర్వాత జరిగిన మలి ఉద్యమానికి గట్టి పునాదులు నిర్మించాయి. ఈ అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ అస్తిత్వానికై అహరహం కృషి చేసిన ఆ తేజోమూర్తుల సేవలను యావత్ తెలంగాణ గుర్తుచేసుకోవటం కనీస బాధ్యత అని చెప్పక తప్పదు.

-పి.వి. శ్రీనివాస్ ఎడిటర్ ఇన్ చీఫ్, బిగ్ టీవీ

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!