Rulers Leaving The Administration System
Editorial

Politicians: పరిపాలన విధానాన్ని వీడుతున్న పాలకులు

Rulers Leaving The Administration System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకొని పాలిస్తున్నారంటే దానికి ప్రజాస్వామ్య ఓటింగ్ విధానం(సివిల్ సొసైటీ) కీలకం. కానీ, అధికారాన్ని చేపట్టిన తర్వాత సివిల్ సొసైటీని, సాధారణ పరిపాలన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి తమ రాజకీయ లబ్ధికి ఉపయోగపడే వ్యవస్థను రూపొందించుకుంటున్న విషయాన్ని అందరూ గమనించాలి. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రజలు ఒక రాజకీయ పార్టీని దించేసి, మరొక పార్టీ పరిపాలనకు అవకాశం కల్పిస్తున్నారు. సివిల్ సొసైటీ సాధారణ పరిపాలన వ్యవహారాలు నిర్వాణ విధానం అమలు చేసిన రాజకీయ పార్టీలకే మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రజాభీష్టం మేరకు పరిపాలన ఉండాలి. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ జీవన వ్యవస్థ, ఆర్థిక బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన వంటి రంగాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా పెరుగుతున్న ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం కట్టడి వంటి చర్యలకు సాధారణ పరిపాలన వ్యవహారాలుగా గుర్తిస్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలో ఉన్న శ్రద్ధ సాధారణ పరిపాలన వ్యవహారాలపై ప్రస్తుతం ఉండడం లేదు.

పరిపాలన అంటే ప్రగల్భాలు పలకడం, వాగ్ధానాలు చేయడం, హామీలు ఇవ్వడం, ఇష్టం ఉన్నట్టుగా రాయితీలు ప్రకటించడం, ఆచరణకు సాధ్యం కాని వరాలు కుమ్మరించడం కానే కాదు. అది అత్యాశ. అంతేకాదు అధికారానికి రావడం కోసం చేస్తున్న పెనుగులాట. మరో రకంగా ప్రజలను, ప్రజాస్వామికవాదులను చేస్తున్న మోసం. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి మోదీ గతంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాల భూమి ఉచితంగా ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటిమూటలే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జర్నలిస్టులు, ప్రతిపక్షాలు, స్వపక్షాలను కూడా వంచించింది. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎనలేనటువంటి హామీలు వాగ్ధానాలు ఇచ్చి ప్రతిపక్షాల ఆగ్రహానికి వెనువెంటనే గురైంది. అందుకే, ఇదంతా పరిపాలనలో భాగం కానే కాదు. ఇది కేవలం ఎన్నికల డ్రామా. ప్రజలను మోసం చేసే విధానం. పరిపాలనకు వికృత రూపమే ఈ హామీలు. ఇవి పరిపాలనలో భాగం కానేకాదు. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గుణపాఠం తెచ్చుకొని హామీలను మానుకొని వాగ్ధానాలకు తెర దించాలి. అభివృద్ధి ఫలాలు సమాజం యావత్తు అనుభవించే విధంగా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం పరిపాలనలో ప్రధానమైన ఘట్టం. వంతెనలు, ప్రాజెక్టులు, కాలువలు, నిర్మాణాలు, గృహ వసతి, పట్టణాలు, నగరాలు, పరిశ్రమలు, పారిశ్రామిక కేంద్రాలు నిర్మించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలందరికీ మహోన్నతమైనటువంటి సౌకర్యాలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ వైపుగా దృష్టి సారించిన ప్రభుత్వమే నిజమైనటువంటి సమయ స్ఫూర్తి గల ప్రభుత్వం అవుతుంది. దారిద్ర్య రేఖ దిగువన గల వర్గాలను మానవాభివృద్ధి క్రమంలో చేర్చడానికి ఆదాయ ప్రాతిపదిక మీద సమానత్వాన్ని సాధించే క్రమంలో పేద వర్గాలకు ఊరట కల్పించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో పేదలకు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపన్న వర్గాలకు పురోగమి పన్ను విధించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి. ఇది సత్తా గల ప్రభుత్వాలకే సాధ్యం. ముందుగా భూమిలేని పేద వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేదలు, వలస కార్మికులు, చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆ వర్గ ప్రయోజనం కోసం వారిని సర్వే చేసి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారి డేటాను సమీకరించి సంస్థ పరంగానూ, ప్రభుత్వ పరంగానూ అవకాశాలను మెరుగుపరచడం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాల యొక్క బాధ్యత.

Also Read: భారతదేశంలో వర్గాల పుట్టుక

ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాల్సినది పోయి కొద్ది సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండడం రాజ్యాంగ రీత్యా దుర్మార్గం. అందుకు ఈ స్థితికి కారకులైన పాలకులకు ఎంత కఠిన శిక్ష విధించినా తప్పులేదు. 77 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పరిపాలనలో ప్రస్తుతం దేశ సంపద 40 శాతం ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉన్నదంటే దానికి పాలకులు బాధ్యులు కాదా. ఈ అసమానతలు, అంతరాలను కొనసాగించాలని చూస్తున్నటువంటి ఆగంతకులైనటువంటి పాలకులకు కఠిన శిక్ష విధించాల్సిందే. రాజ్యాంగం అందుకు అనుమతించి సర్వోన్నత న్యాయస్థానం శిక్ష విధించాలి. గత 10 ఏళ్లలో దేశంలో 14 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దుచేసి కేంద్రం పెట్టుబడిదారులకు వంత పాడితే ఇటీవల బడ్జెట్లో కేంద్రం సంపన్న వర్గాల యొక్క పన్ను రాయితీని ప్రకటించడం ద్వారా సంపన్న వర్గాలకు ఊడిగం చేయడమే కాదు అసమానతలను మరింత పెంచి పోషించడం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అంతేకాదు, అశాంతికి, పోరాటాలకు, వర్గ సంఘర్షణకు దారితీస్తుందని సోయి లేకపోతే ఎలా? ఇప్పటికీ 15 శాతం జనాభా దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తుంటే పేదరికం, ఉపాధి అవకాశాల లేమి కారణంగా కోట్లాది ప్రజానీకం రెండవ శ్రేణి పౌరులుగా అనాధలుగా జీవిస్తుంటే పాలకులకు ఇసుమంత కూడా రోషం లేకపోతే ఎలా? ఆసమానతలు అంతరాలను నిర్మూలించే క్రమంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా దేశ సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేసే క్రమంలో ఉదాత్తమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడమే నిజమైన పాలన. లేకుంటే ఆ పరిపాలన ప్రజల చేతిలో బలి కాక తప్పదు.

మానవాభివృద్ధి ప్రభుత్వ బాధ్యత. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, చదువు, వైద్యం, విద్యుత్ శక్తి, ఇతర అవసరాలను సమకూర్చుకోలేనటువంటి దుస్థితిలో కోట్ల కుటుంబాలు ఈ దేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ అమర్త్యసేన్ కనీస అవసరాలను తీర్చుకోగలిగిన మానవాభివృద్ధిని సాధించకపోతే ఆ ప్రభుత్వానికి అర్థం లేదు, అది పరిపాలన కానే కాదు అని నిష్కర్షగా విమర్శించిన తీరు పాలకులకు గుర్తు రాకపోతే ఎలా? అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు మరొక చోట. భవనాలు, ఆస్తులు, అంతస్తులు ఒకచోట, బక చిక్కిన డొక్కలు, మాడిన మనుషులు మరొకచోట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వివక్షత ఈ దేశంలో కొనసాగుతుంటే ఇది మానవాభివృద్ధి ఎలా అవుతుంది? కనీస అవసరాలకు కూడా నోచనటువంటి కోట్లాది మందిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కూడా మనసొప్పని పాలకులకు కఠిన శిక్ష విధించాల్సిందే. అవసరాలను గుర్తించడం, ఆదాయ మార్గాలను సమకూర్చడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రజా సంపదను, పేద వర్గాలకు వివిధ రూపాలలో సమకూర్చడం ద్వారా ఆ కుటుంబాలను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా మానవాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు, సామాజిక నిపుణుల సహకారాన్ని పరిశీలించకుండా ఒంటెద్దు పోకడలో వ్యవహరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రజల చేతిలో పరాభవాన్ని ఎదుర్కోక తప్పదు.

-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం)

Just In

01

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?