Parliament Elections Voter Consciousness Should Flow
Editorial

Parliament Elections: ఓటరు చైతన్యం వెల్లివిరియాలి..!

Parliament Elections Voter Consciousness Should Flow: తెలంగాణలో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్‌సభకు తెలంగాణలోని 17 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో సహా మొత్తం 525 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. వీరిలో 285 మంది స్వతంత్ర అభ్యర్ధులు కాగా, మిగిలిన వారు ఆయా పార్టీలకు చెందినవారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా సికింద్రాబాద్‌ స్థానానికి 45 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, ఆదిలాబాద్‌ స్థానానికి అత్యల్పంగా 12 మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతున్న కారణంగా ఈసారి కూడా ఎన్నికల సంఘం అధికారాలు ఓటర్లను చైతన్యపరచే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావటమే ఆలస్యం. మొత్తానికి ఈరోజు సాయంత్రానికి ఓటరు మనసులోని మాట ఓటు రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

మన దేశంలో ఓటు రావటం వెనక చాలా కథే ఉంది. 1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు ఉపయోగించుకునే విషయంపై చేసిన సిఫార్సులతో 1909లో కౌన్సిల్ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు పొందే హక్కును కల్పించింది. 1919 కౌన్సిల్ చట్టం ఓటును వినియోగించుకునే అవకాశాన్ని మరింత విస్తృత పరిచింది. 1935లో ఓటు హక్కును దేశ జనాభాలో 10.5 శాతం మంది ఉపయోగించుకునేలా చేసింది. 1947లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా దాన్ని 28.5 శాతానికి పెంచారు. స్వాతంత్య్రానంతరం సార్వత్రిక వయోజనులందరికీ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఆ పద్ధతిలో 1952 నుంచి దేశంలో వివిధ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వయోజనులు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల నేడు అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ విరాజిల్లుతోంది.

Also Read: ప్రచారం ముగిసింది, ఇక నిర్ణయమే బాకీ..

ఓటరు చైతన్యం విషయంలో పల్లె ఓటరు కంటే పట్టణ, నగర ప్రాంత ఓటరు వెనకబడి ఉన్నాడు. గ్రామీణ ఓటర్లు బస్సుల్లో, రైళ్లల్లో తిప్పలు పడుతూనే సొంతూరు వెళ్లి ఓటు వేసి వస్తుంటే, నగరంలోని కార్పొరేట్‌, ఐటీ, ఇతర రంగాల్లో పని చేసే చాలా మంది ఉద్యోగస్తులు పోలింగ్‌ రోజును కేవలం ఒక సెలవు దినంగా పరిగణించి సరదాగా సమయం గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ పరిధిలో ప్రతి ఎన్నికల సమయంలోనూ అతి తక్కువ శాతం పోలింగ్ నమోదవుతోంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్‌లో సుమారు 21 లక్షలు, హైదరాబాద్ సీటు పరిధిలో 22 లక్షలు, చేవెళ్ల పరిధిలో 29 లక్షల ఓట్లుండగా, మల్కాజ్‌గిరి సీటు పరిధిలో 37 లక్షల ఓటర్లున్నారు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అతి తక్కువ పోలింగ్ నమోదైన 50 స్థానాల్లో 4 స్థానాలలో తెలంగాణ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి ఉన్నాయి. ఈ నాలుగూ రాజధాని హైదరాబాద్ పరిధిలోనేవే కావటం విషాదం. దేశవ్యాప్తంగా అత్యల్ప ఓటింగ్ జరిగిన సీట్లలో హైదరాబాద్ 4వ స్థానంలో, సికింద్రాబాద్ 7వ స్థానంలో, మల్కాజ్‌గిరి 12వ స్థానంలో, చేవెళ్ల 25వ స్థానంలో నిలిచాయి. బాధ్యతాయుతమైన పౌరులుగా భారత రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వారు ప్రభుత్వాలను నిందించటం తప్ప వ్యవస్థ బాగు కోసం తమలాంటి వారి సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తించకపోవడం విచారకరం. ఈసారైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.

నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది అయిన మన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. దీనివల్ల ప్రజలు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ప్రజా సంక్షేమం కుంటుపడుతుంది. కాళోజీ అన్నట్లు ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పాటి వాడో చూడాలి’ అనే మాట కూడా పోలింగ్ రోజున ఓటరు ఒక ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన పాలనా వ్యవస్థ. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే అక్కడి ప్రజలు హాయిగా, స్వేచ్ఛగా జీవించగలుగుతారు. తమ మనసులోని భావాలను ఎలాంటి భయమూ లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నప్పుడే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాలను సైతం నిలదీయగలుగుతారు. తమ హక్కులను కాపాడుకోగలుగుతారు. ప్రజలు చైతన్యవంతులై, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ఈ వ్యవస్థ పదికాలాల పాటు నిలబడుతుంది. సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలన్నా, మన జీవితాలు, తల రాతలు మారాలన్నా, అది పారదర్శకమైన ఎన్నికలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. కనుక అందరూ ఓటు వేసినపుడే, రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ, దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. కనుక అందరం తప్పక ఓటు వేద్దాం.

-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్‌)

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు