Lok Sabha Election Results 2024 Won The Congress Party In Telangana
Editorial

Congress Party: పార్లమెంటు బరిలోనూ సత్తా చాటిన హస్తం..

Lok Sabha Election Results 2024 Won The Congress Party In Telangana: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తరువాత జరిగిన మూడవ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సీట్లతో బాటు ఓట్లనూ పెంచుకుని తెలంగాణపై తన పట్టును నిలబెట్టుకోగలిగింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా, 2019 ఎంపీ ఎన్నికలలో 3 సీట్లు సాధించగలిగింది. కానీ, 18వ లోక్‌సభ ఎన్నికల్లో తన బలాన్ని 3 నుంచి ఎనిమిది సీట్లకు పెంచుకోవటమే గాక 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను సాధించిన 24.6 ఓట్ల శాతాన్ని ఈసారి 40.1 శాతానికి పెంచుకోగలిగింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటూ సాధించలేకపోగా, బిజెపి 2019లో తాను సాధించిన 4 సీట్లకు అదనంగా మరో నాలుగు సీట్లు సాధించింది.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చూపిన పనితీరు, సీనియర్ నేతలందరినీ కలుపుకొని పోవటం, కార్యకర్తలకు అండగా నిలిచి నాటి కేసీఆర్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజా పోరాటాలుగా మలచటంలో ఆయన తెగువ కారణంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు హస్తం పార్టీకి అండగా నిలిచారు. రైతాంగం, గిరిజన, నిరుద్యోగ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను గుర్తించి, వాటికి వేర్వేరుగా డిక్లరేషన్లు ప్రకటించి ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపగలిగారు. దీంతో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం అనతి కాలంలోనే పెరిగింది. దీనికి తోడు అనాదిగా కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలమైన పార్టీ నిర్మాణమూ రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీలోని పాత నేతలు, కొత్తగా పార్టీలో చేరిన నేతలంతా ఒక్కటై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయటంలో కీలక పాత్ర పోషించారు.

Also Read: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహకందని తీర్పు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూనే, పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేశారు. ఖాళీ ఖజానా, గందరగోళంగా మారిన పాలనా వ్యవస్థల వంటి పరిమితులను అధిగమిస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే, పెండింగ్‌లో ఉన్న రైతు రుణమాఫీని పంద్రాగస్టులోగా అమలు చేస్తానని సీఎం ప్రకటించారు. పాలనా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావటంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే వీలు లేకుండా పోయింది. దీంతో పాలనా బాధ్యతలను పర్యవేక్షిస్తూనే, మరోవైపు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 14 సీట్లు సాధించటమే తమ లక్ష్యమని ప్రకటించటమే గాక ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అని ధైర్యంగా ప్రకటించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియాలోనూ కాంగ్రెస్ విధానాలను వివరిస్తూ, నిరంకుశ మోదీ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈసారి మోదీ చెబుతున్నట్లుగా 400 సీట్లు బీజేపీ సాధిస్తే, భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతుందనే ఆయన ప్రచారం కింది స్ధాయిలోని ప్రజలకు చేరటంతో ఈ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీకి ఎనిమిది సీట్లు అందించారు. ఈ అంశం జాతీయ స్థాయి చర్చకూ దారితీసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగేందుకు రేవంత్ రెడ్డి పరోక్షంగా కారణమయ్యారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 8 సీట్లలో ఆరుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లక్షకు పైగా మెజారిటీ సాధించగా, నల్గొండ ఎంపీ అభ్యర్థి కె. రఘువీర్ రెడ్డి ఏకంగా ఐదు లక్షలకు పైచిలుకు ఓట్లు సాధించారు. మరోవైపు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘరామిరెడ్డి నాలుగు పై చిలుకు ఓట్లు సాధించారు. ఇక.. బీజేపీ విజయం సాధించిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. అలాగే, మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ తక్కువ ఓట్లతో పరాజయం పాలైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ రహస్య అవగాహనకు వచ్చాయని, ఈ క్రమంలో 5 సీట్లను బీజేపీకి కేసీఆర్ వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఉదాహరణకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలిచిన కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి వంటి సీట్లలోనూ బీజేపీకి భారీ ఓట్లు రావటం, ఈ స్థానాల్లో బీఆర్ఎస్ నామమాత్రపు ఓట్లతో సరిపెట్టుకోవటం, ఈ ఎన్నికల్లో తాను బరిలో నిలిచిన 17 లోక్‌సభ స్థానాల్లో 8 చోట్ల గులాబీ పార్టీ డిపాజిట్లు కోల్పోవటం వెనక ఈ రెండు పార్టీలు కుదుర్చుకున్న అవగాహన ప్రజలకు నేడు స్పష్టంగా అర్థమైంది. ఈ 8 సీట్లలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవటం గమనార్హం.

18వ లోక్‌సభ స్థానంతో బాటు కంటోన్మెంట్ శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా గెలుచుకుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుగా ఉన్న కంటోన్మెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపిక మొదలు, ప్రచారం విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కంటే ముందు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కానీ, తాను అధికారంలోకి వచ్చిన 3 నెలలకే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో.. సీఎం రేవంత్ ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ సాధించిన దానికంటే చాలా మెరుగైన ఫలితాలను సాధించి చూపారు. ఈ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలను సాధించే దిశగా పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి సన్నద్ధం చేస్తున్నారు. అదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ప్రజలకిచ్చిన హామీల అమలుకు సిద్ధం కావటం సంతోషించాల్సిన విషయం.

-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?