Let’s See Who Wins The Lok Sabha Elections: దేశంలో 18వ లోక్ సభకి జరగబోయే ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులలో జరిగే ఈ లోక్ సభ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం మూడు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచిన సానుకూలతతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మోడీకి అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణంతో బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతుంటే బీఆర్ఎస్ మాత్రం శాసనసభ ఎన్నికలలో ఎదురైన ఓటమి నుండి బయటపడి ఈసారి గెలిచి తన ఉనికి చాటుకోవాలనే వ్యూహంతో బరిలోకి దిగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన 2014 మరియు 2019 లోక్ సభ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి మెజార్టీ లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత రాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలలో ఏ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతుంది? ఏ పార్టీ మెజార్టీ లోక్ సభ స్థానాలను గెలవబోతుందనే అంశాలపై రాజకీయ వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
అధికార పార్టీకి అనుకూలం
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ 2014 లోక్ సభ ఎన్నికలలో 2 స్థానాలు, 2019 లోక్ సభ ఎన్నికలలో 3 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కానీ, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుండి మెజార్టీ లోక్ సభ స్థానాలను సాధించబోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలలో గెలవబోతుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలలో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిన విధంగానే లోక్ సభ ఎన్నికలలో కూడా దక్షిణ తెలంగాణ నుండి ఐదు లోక్ సభ స్థానాలలో గెలవడంతో పాటు ఇంకో 7 సీట్లలో కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోక్ సభ స్థానం మినహా మిగతా 16 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 39 శాతం ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ మూడు నెలల కాలంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన నేతలతో పాటు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలతో తన ఓటు బ్యాంకుని మరింత పెంచుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలవడంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. అదే క్రమంలో లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో బలం పెరగటమే కాదు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక బలమైన నేతగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు.
బలహీనపడుతున్న ప్రతిపక్షం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తొలి ప్రభుత్వంగా దరిదాపు ఒక దశాబ్దం పాటు పాలకపక్షంగా ఉన్న బీఆర్ఎస్ 2023లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఆ తరువాత పార్టీ క్రమంగా బలహీనపడుతున్న ఛాయలు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలన తర్వాత ఎంపీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ద్వితీయ శ్రేణి నేతలు, రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీ మారటంతో పాటు ఇప్పటికే ఏడుగురు శాసనసభ్యులు అధికార పార్టీకి టచ్ లోకి వెళ్లిన నేపథ్యం, ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించాల్సిన కేసీఆర్ రాజకీయంగా క్షేత్రంలో ప్రజలలో లేకపోవటం మైనస్. పైగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొని గతంలో గెలిచిన 9 లోక్ సభ స్థానాలను నిలబెట్టుకుని తన ఉనికిని కాపాడుకోవటం బీఆర్ఎస్ కి కత్తి మీద సామే. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తీసుకెళ్లటాన్ని కూడా తప్పు పట్టి ప్రజలలో పలచనయ్యారు. ప్రభుత్వం మారిన ఈ మూడు నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ తప్పటడుగులు వేస్తుందనే చెప్పాలి. బీఆర్ఎస్ సైన్యాధ్యక్షుడు లేని సైన్యం లాగా కనిపిస్తోంది. అయితే, ఎంఐఎం సహకారంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఆశించిన ఫలితాలు రాబట్టకపోవచ్చు. రెండు లేదా మూడు లోక్ సభ నియోజకవర్గాలలో మాత్రమే గెలవగలిగే అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఆశల పల్లకిలో బీజేపీ
కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోడీ చరిష్మాతో తెలంగాణ రాష్ట్రంలో గత లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్థానాలు గెలిచిన విధంగానే ఈసారి కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆశల పల్లకిలో రాష్ట్ర నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కామారెడ్డి లాంటి శాసనసభ నియోజకవర్గంలో అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి గెలుపొందటంతో పాటు తన ఓటు బ్యాంకుని 7 నుండి 14 శాతానికి పెంచుకోవడంతో బీజేపీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న తన ఓటు బ్యాంకుని 20 శాతానికి పైగా పెంచుకోగలిగితే గతంలో గెలిచిన స్థానాలతో పాటు మరొక రెండు మూడు స్థానాలు అదనంగా గెలవవచ్చనే వ్యూహంతో బలమైన అభ్యర్థుల్ని బీజేపీ బరిలోకి దింపుతోంది. దక్షిణాదికి గేట్ వే లాంటి తెలంగాణ రాష్ట్రంలో మరింత బలం పెంచుకొని బీఆర్ఎస్‌ని వెనుకకు నెట్టి కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఎదగాలనేదే బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యంగా కనిపిస్తోంది.
రాష్ట్రం కోసం పనిచేసే ఎంపీలు కావాలి
తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగే, పనిచేసే ఎంపీలు కావాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా క్రియాశీలకంగా పనిచేసిన ఎంపీలు తరువాత విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను రాబట్టటంలో, నిధులను, ప్రాజెక్టులను తేవటంలో అదే స్ఫూర్తితో ఈ దశాబ్ద కాలంలో పని చేయలేదనేది వాస్తవం. రాష్ట్రం నుండి 17 మంది లోక్ సభ సభ్యులు 8 మంది రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీల విషయంలో, రైల్వే ప్రాజెక్టుల విషయంలో, నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల సేకరణ విషయంలో, జాతీయ విద్యా సంస్థల సాధనలో, వెనకబడిన జిల్లాలకు నిధుల సాధనలో, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధనలో, ఎంపీల నిష్క ప్రియాతత్వం వలన రాష్ట్రానికి నష్టం జరిగిందనే చెప్పాలి. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎంపీల ఒత్తిడితో కేంద్రం నుండి రాష్ట్రం ఏం సాధించలేకపోయిందనేది వాస్తవం కాబట్టి, రాబోయే ఎన్నికలలో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పనిచేసే వారిని లోక్ సభకు పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంభించడం వలన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కొత్త ప్రభుత్వం, కొత్తగా ఎన్నిక కాబోతున్న ఎంపీలైనా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వారిధిగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని ఆశిద్దాం.
డా. తిరునహరి శేషు (రాజకీయ విశ్లేషకులు)
కాకతీయ విశ్వవిద్యాలయం