General Elections Many Lessons
Editorial

General Elections: సార్వత్రిక ఎన్నికలు, ఎన్నో గుణపాఠాలు

General Elections, Many Lessons: ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అయినప్పటికీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు రక్షించడానికి నేడు రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే విలువలతో కూడిన దాఖలాలు మనకు కనిపించడం లేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మొదటి, రెండు తరాల్లో రాజకీయాలలో విలువలు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో కూడుకున్న రాజకీయాలు కొనసాగాయి. కానీ, 2014 నుంచి నిరంకుశ, నిర్బంధ రాజకీయ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగింది. ప్రశ్నించే వారిని నిర్బంధించే విధానం ఈ పది సంవత్సరాల్లో కొనసాగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉంది. ఇటువంటి రాజకీయ వ్యవస్థకు బుద్ధి వచ్చేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు భిన్నమైన తీర్పును ఇచ్చారు.

18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 2 వరకు 7 విడతలుగా జరిగాయి. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారత్‌లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూసింది. కానీ, ఆంధ్రా, కర్ణాటక మినహా మిగిలిన చోట్ల అంతగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికలలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అయితే, 2018లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ అప్పుడు 9 గెలుచుకొని తన సత్తాను చాటుకున్నది. అదే హవాను పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించి 8 సీట్లను సాధించింది. దీన్నిబట్టి చూస్తే బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని అర్థమౌతోంది. కేంద్ర నాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయి గల వ్యక్తి 20 సార్లు బహిరంగ సభలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఊపుతో కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసి 8 సీట్లు సాధించగలిగింది. ఎంఐఎం ఒక్క సీటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన ఎన్నికలుగా, ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చినప్పటికీ అక్కడి ప్రజలు వినూత్న రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. దీనికి కారణాలు అనేకం. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పరిపాలనా వ్యవహారాలు సమర్థనీయంగా ఉన్నప్పటికీ, రాజధాని మార్చడం పెద్ద పొరపాటుగా చెబుతున్నారు.

Also Read: అస్తిత్వ పరిరక్షణే తెలంగాణ తక్షణావసరం

భారతీయ జనతా పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లో రామ జన్మభూమి స్థానంలో తిరిగి రాముని విగ్రహాన్ని ప్రతిష్టించింది. భారతదేశ వ్యాప్తంగా రామనామం జపం చేయడం జరిగింది. 2014 నుండి 2024 వరకు పది సంవత్సరాల పరిపాలన కాలంలో భారతీయ జనతా పార్టీ తన అధికార రాజకీయ సుస్థిరతను నెలకొల్పుకోవడానికి చేపట్టిన చర్యల్లో ముఖ్యంగా ఆర్టికల్ 360 రద్దు, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకతను రద్దు చేయడం, త్రిపుల్ తలాక్, వంటి మేజర్ కార్యక్రమాలను చేపట్టింది. అయితే, భారతదేశ అంతర్జాతీయ సంబంధాలలో గతంలో ఎన్నడు లేని విధంగా మోదీ దాదాపు అగ్ర రాజ్యాలతో నెలకొల్పిన దౌత్య సంబంధాలు ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. అయితే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కుంభకోణాలను తీవ్రంగా ప్రచారం చేయడంలో బీజేపీ సఫలమైంది. భారతదేశంలో ఆర్థిక సుస్థిర సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థను బీజేపీ బలోపేతం చేసినట్లు ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతమైనట్లు చెప్పవచ్చు. అధికంగా అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం కూడా ఐదో స్థానంలో ఉందని ప్రసారం చేయడంలో ఎన్డీఏ కూటమి సఫలం అయింది. అలాగే, కాంగ్రెస్ కూటమిలో సమర్థవంతమైన నాయకత్వం లేదని ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారంలో సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్ర మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ గెలుచుకున్న స్థానాలను బట్టి చూస్తే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర దేశ్ కీ బచావో అన్న నినాదంతో కూటమి ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం అంటే 80 శాతం ఉన్న హిందూవుల దేశంగా ప్రచారం చేయడంలో బీజేపీ విజయం సాధించింది.

కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం అన్నట్లుగా తన ప్రచార కార్యక్రమాన్ని(సెక్యులర్) నినాదంతో ముందుకు సాగింది. ఏది ఏమైనా భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, గెలుపు ఓటములతో ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. గడిచిన 75 సంవత్సరాలుగా దేశంలో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రస్తుతం ఆధునిక శాస్త్ర సాంకేతిక కాలంలో కూడా అదేవిధంగానే కొనసాగుతోంది. ముఖ్యంగా రాజకీయాలలో కుట్రలు, కుతంత్రాలే. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వాడు చరిత్ర హీనుడు కాక తప్పదు. కాబట్టి 18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశ ప్రజా జీవన వ్యవస్థలో తీవ్రమైన మార్పులు తీసుకువస్తాయన్న నమ్మకం లేదు. ఎప్పటి లాగానే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమరలో అస్తమిస్తాడు. సామాజిక వ్యవస్థలలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. భూమిని నమ్ముకున్న రైతుకు పొద్దున్నే లేచి మట్టిలో పనిచేయాల్సిందే. కష్టాన్ని నమ్ముకున్న కూలీ పనికి వెళ్లాల్సిందే. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ గెలిచినా, ఏ రాజకీయ నాయకుడు అధికారంలోనికి వచ్చినా ప్రజా జీవితంలో పెద్ద మార్పు ఉండదని చెప్పాలి. అయితే, ఈసారి ఇచ్చిన తీర్పు దేశంలో మేధావి వర్గాన్ని ఆలోచింపజేశేలా ఉంది.

-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం)

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ