Elephant Vs Donkey In Superpower America, Who Will Win
Editorial

Elections War: ఏనుగు వర్సెస్ గాడిద.. గెలిచేదెవరో?

Elephant Vs Donkey In Superpower America, Who Will Win: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశంలో సుమారు 30 లక్షల మంది భారతీయులు విద్య, ఉపాధి కారణంగా నివసిస్తున్న నేపథ్యంలో అక్కడి ఎన్నిక పట్ల భారత‌లోనూ ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. అక్కడ ఎవరు అధికారంలోకి వస్తే మన దేశంతో సంబంధాలు బాగుంటాయి? మన యువతకు ఉద్యోగాలొస్తాయి? ఇప్పటికే అక్కడ ఉన్నవారికి శాశ్వత నివాస హోదా దక్కుతుంది? వంటి అంశాల మీద మనదేశంలో చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్‌ అయిన జో బైడెన్ రెండోసారి అధ్యక్షుడిగా గెలవాలని ప్రయత్నాలు చేస్తుండగా, 2020లో అధ్యక్ష స్థానంలో ఉండి, బైడెన చేతిలో ఊహించని రీతిలో పరాజయం పాలైన మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అయిన డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచి తీరతానంటూ శపథాలు చేస్తూ, దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశం. ఇక్కడ నాలుగేళ్ళకు ఒకసారి నవంబర్ మొదటి మంగళవారం రోజున అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. 1845 నుంచి ఈ ఎన్నికలు నిరాటంకంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట సంఖ్యలో ఓట్లు ఉంటాయి. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. అమెరికాలో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ఎన్నిక అయ్యాక జనవరి 20వతేదీ నుంచి కొత్త అధ్యక్షుడు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి. ఇక్కడ 50 రాష్ట్రాల్లోని మైనే, నెబ్రాస్కా మినహా అన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అభ్యర్థికి మెజారిటీ వస్తే.. అక్కడి ఎలక్టొరల్ ఓటు ఆ పార్టీకి దక్కుతుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో 12 అంతకు మించి రాష్ట్రాల్లో పూర్తిగా పట్టుసాధించి, మిగతాచోట్ల మధ్యస్థంగానైనా సత్తా చాటితే అధ్యక్ష పీఠం సొంతమైనట్లేననే భావన ఆదినుంచి అక్కడి పార్టీలకు ఉంది. ఈ 12 రాష్ట్రాలనే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు.

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుండగా, వీటిలో ఆదినుంచి కొన్ని రిపబ్లికన్లకు, మరికొన్ని డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. రిపబ్లికన్ల హవా సాగుతున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అనీ, డెమొక్రాట్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలను బ్లూ స్టేట్స్ అంటారు. రెడ్ స్టేట్స్ జాబితాలో ఇడాహో, వ్యోమింగ్, సౌత్ డకోటా, నార్త్ డకోటా, మోంటానా, ఉటా, కాన్సాస్, ఓక్లహోమా, మరియు నెబ్రాస్కా వంటి చాలా పర్వత రాష్ట్రాలు, అలబామా, జార్జియా, మిసిసిపీ, లూసియానా లాంటి గ్రేట్ ప్లెయిన్స్, అర్కాన్సాస్, టేనస్సీ, సౌత్ కరోలినా, అలాస్కా రాష్టాలుండగా, బ్లూ జాబితాలో న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, న్యూ ఇంగ్లాండ్, వెర్మోంట్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాలున్నాయి. అమెరికాలో ఆదినుంచి కార్పొరేట్లు, కులీన వర్గాల వారు, ఆర్థికంగా స్థిరపడిన వారు రిపబ్లికన్లకు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటుండగా, తక్కువ పన్నులు కట్టే చిన్న వ్యాపారవేత్తలు, ఉద్యోగులు డెమొక్రాట్ల వైపు నిలుస్తుంటారు. రిపబ్లిక్ పార్టీ ప్రపంచ స్థాయి వ్యాపార ప్రణాళికలు, పెద్దలాభాల గురించి తన ప్రణాళికలను నమ్ముుతుండగా, తక్కువ పన్నులు విధించి, ఎక్కువ మందిని ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తేవాలని, పన్నుల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఉత్పాదకత దెబ్బతింటుందని డెమొక్రాట్ల విశ్వాసంగా కనిపిస్తుంది. అయితే, కనీసం 6 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయే (స్వింగ్ స్టేట్స్) అవకాశమూ ఉంటుంది.

Also Read: మాయలపెట్టె పనితీరుపై మాటల యుద్ధం

రెండు పార్టీల ప్రచార ధోరణిని గమనిస్తే, కొన్ని కీలక అంశాల విషయంలో తేడాలు, సారూప్యాలూ కనిపిస్తున్నాయి. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారి విషయంలో (ముఖ్యంగా మెక్సికో సరిహద్దు నుంచి) రిపబ్లికన్లు పూర్తి వ్యతిరేకంగా ఉండగా, డెమొక్రాట్లు ఈ విషయంలో కాస్త ఉదారంగా ఉండాలని, వలస నిబంధనలను సులభతరం చేస్తే అక్రమ వలసలు ఉండవని చెబుతున్నారు. తమ మిత్రదేశాలు తమనుంచి అన్ని లాభాలనూ పొందుతున్నా.. వాటి నుంచి తమకు దక్కుతున్నది పెద్దగా లేదనేది రిపబ్లికన్ల భావన కాగా, డెమొక్రాట్లు మాత్రం యూరప్, ఇండో- పసిఫిక్ దేశాలతో స్నేహాన్ని సమర్థించుకుంటున్నారు. ఇక.. తమకు ప్రధాన పోటీదారుగా ఉన్న చైనా, అనాదిగా తమకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ విషయంలో వారిద్దరి అభిప్రాయాల్లో ఏమాత్రం మార్పు లేదు. అలాగే, బయటిదేశాల్లో ప్రత్యక్ష, బహిరంగ సైనిక చర్యలు తగ్గించుకోవాలనే నిర్ణయంలోనూ ఇద్దరి విధానాలూ దాదాపు ఒకేలా ఉన్నాయి.

ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రత, పశ్చిమాసియా విధానం, ఉత్పాదకత, నానాటికీ తగ్గిపోతున్న ఉద్యోగాలు, అధ్యక్షుడిగా బైడెన్ పనితీరు వంటి అంశాలతో బాటు ఈసారి అబార్షన్ల అంశం కీలక ప్రచారాస్త్రంగా మారుతోంది. గతంలో అమెరికా మహిళలకు అబార్షన్‌ హక్కు ఉండేది. అయితే 2022లో సుప్రీంకోర్టు ఈ హక్కును రద్దు చేయటంతో ఇప్పడు ఈ అంశం ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. తన కాథలిక్‌ విశ్వాసాల కారణంగా వ్యక్తిగతంగా బైడెన్ అబార్షన్‌‌కు వ్యతిరేకమైనప్పటికీ, అబార్షన్‌ అవసరమా లేదా అనేది సదరు మహిళ నిర్ణయమేనని, మహిళా హక్కులకు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని బైడెన్ చెబుతున్నారు. కాగా, డోనాల్డ్‌ ట్రంప్‌ దీనిపై తన వైఖరిని ఇంకా ప్రకటించలేదు. అయితే, 2016 ఎన్నికల ప్రచారంలో మహిళల హక్కులను కాపాడతానని హామీలిచ్చి, వైట్‌హౌస్‌‌లో అడుగుపెట్టాక, తాను తాను అబార్షన్‌‌కు వ్యతిరేకమన్నట్లు వ్యవహరించారు. దీంతో ఒకవేళ ట్రంప్ గెలిస్తే గర్భస్రావపు మందులనూ నిషేధిస్తాడనే భయం మహిళల్లో ఉంది. అబార్షన్‌‌కు సంబంధించి అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలుండటంతో అబార్షన్‌కు అనుమతి లేని రాష్ట్రాల మహిళలు మెక్సికో నుంచి దొంగచాటుగా అధిక ధరలకు ఈ మందులను కొని నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజా ఒపినియన్ పోలింగ్‌లో 7 రాష్ట్రాలలో ఆరింట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తన ప్రత్యర్థి ట్రంప్ కంటే వెనకబడి ఉన్నారు. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, వృద్ధ నాయకుడిగా బైడెన్ కంటే ట్రంప్ బెటర్ అనే అభిప్రాయం, కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాల ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ 7 రాష్ట్రాల్లో నిర్వహించిన తాజా ఒపినియన్ పోల్‌లో పెన్సిల్వేనియా, మిచిగాన్, ఆరిజోనా, జార్జియా, నేవ్డా, నార్త్ కరోలినా రాష్ట్రాలో ట్రంప్ 2.8 శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారు. కాగా విస్కాన్సిన్ లో మాత్రం బైడెన్.. ట్రంప్ కన్నామూడు పాయింట్లు ఆధిక్యతను కనబరచారు. ఎన్నికల ప్రచార శైలిలోనూ ట్రంప్ బృందాలు వినూత్నంగా పనిచేస్తున్నాయి. ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోని బృందాలను కలిసి, వారి సమస్యలు అర్థం చేసుకుని, వారికి తగిన హామీలివ్వటం మీద వీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలాగే, అమెరికాలోని భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ఇండియన్ వాయిస్ ఫర్ ట్రంప్, సిఖ్ వాయిస్ ఫర్ ట్రంప్ వంటి బృందాలను తయారుచేసింది. ఈ గ్రూపులోని 20 మంది సభ్యులు తమకు తెలిసినవారికి వాట్సప్ ద్వారా లేదా స్వయంగా కలిసి, ట్రంప్ విజయాలను, లక్ష్యాలను వివరిస్తున్నారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు ఏమి చేసింది? ఇండియాకి ఏమి చేసింది? మోదీతో కలిసి తాను సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ వారి మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, బలపడుతున్న ఆర్థిక వ్యవస్థ, తక్కువ నిరుద్యోగం, రుణ విముక్తి, చట్టపరంగా ట్రంప్‌ ఎదుర్కొంటున్న కష్టాల వంటి అంశాల మద్దతుతో నవంబరు నాటికి పుంజుకోగలమని బైడెన్‌ వర్గం నమ్ముతోంది.

మనదేశంలో ఉన్నట్లే అమెరికాలోనూ పలు మీడియా సంస్థల్లో కొన్ని డెమొక్రాట్లకు, మరికొన్ని రిపబ్లికన్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. వాటి యాజమాన్యాల మనసు తెలుసుకుని, అందుకు తగినట్లుగా తమకు ఇష్టమైన పార్టీ విజయాలను తమ న్యూస్, విశ్లేషణలు, ఇంటర్వ్యూల ద్వారా జనంలోకి తీసుకుపోతున్నాయి. వీటిలో ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ట్రంప్‌ విజయావకాశాల గురించి ఎక్కువగా కథనాలు ఇస్తున్నాయి. అయితే, ఈ కథనాల్లో ఎంత వాస్తవముందో తెలియాలంటే కనీసం మరో వందరోజులైనా వేచిచూడాల్సిందే.

Just In

01

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు