Any Check On Food Inflation
Editorial

Food Inflation: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?

Any Check On Food Inflation: దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4 సాయంత్రానికి 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలూ వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని కమలనాథులు చెప్పుకొస్తున్నారు. సుమారు రెండు నెలల పాటు సాగిన ఈ ఎన్నికల ప్రచారంలో గత పదేళ్లుగా దేశాన్ని పాలించిన ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు, సదరు పార్టీ నేతలంతా భావోద్వేగాలకు సంబంధించిన అంశాలనే ప్రచారం చేశారు తప్ప, దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆహార లభ్యత వంటి కీలక అంశాలను ఎక్కడా చర్చించేందుకు సాహసించలేకపోయారు.

టోకు ధర సూచిక (హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం.. ఆహార పదార్థాల ధరలు 2024 మార్చిలో 6.88 శాతం ఉండగా ఏప్రిల్‌కి వచ్చేసరికి అది 8.7 శాతానికి పెరిగింది. నిరుడు ఇదే కాలంతో పోల్చితే 18 బేసిస్‌ పాయింట్లు, నెలవారీ రేటు ప్రాతిపదికన గత నెలతో పోలిస్తే 0.74 శాతం పెరుగుదల నమోదైంది. 2024 జనవరి నుంచి ఈ స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే మొదటి సారి. ఏప్రిల్‌ నెలలో దేశమంతా నెలకొన్న విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల ప్రభావం, మే నెలలోనూ ఇదే వాతావరణం నెలకొనటంతో గోధుమలు, కూరగాయలు, పండ్లు, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. బుుతుపవనాలు సకాలంలో వచ్చి, తగినంత వర్షపాతం నమోదైతే తప్ప.. ఆహార ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఎన్డీయే సర్కారు 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార వస్తువుల ధరలు పైపైకే చూస్తున్నాయి. 2023 నవంబర్‌లో తొలిసారి ఆహార ద్రవ్యోల్బణం 8శాతం దాటింది. అప్పటి నుండి ఇంకా పైపైకే దూసుకుపోయింది తప్ప ఏ దశలోనూ కిందికి దిగలేదు.

Also Read: నవ భారత నిర్మాత మీద నిందలా?

నానాటికీ పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం నగర, పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల వారి మీద ఎక్కువగా ఉంటోంది. ఏప్రిల్ నెలలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 5.43 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4.11 శాతంగా నమోదైంది. నిరుటితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఆహారధాన్యాల ధరలు 8.75 శాతం పెరగగా, పట్టణ ప్రాంతాల్లో 8.56 శాతం మేర పెరిగాయి. ఈ పదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ఏటికేడు గ్రామీణ ప్రాంతాల మీద ఆర్థికపరమైన ఒత్తిడి కొనసాగుతూనే వస్తోంది. 2024 మార్చితో పోల్చితే ఏప్రిల్ నాటికి తృణధాన్యాల ధరలు 8.63 శాతం, పండ్లు 5.22 శాతం, నూనెలు 9.43 శాతం, మాంసం-చేపల ధరలు 8.17 శాతం మేర పెరిగాయి. కూరగాయలు, వంటనూనెల ధరలు వరుసగా రెండు నెలల్లోనూ (మార్చి, ఏప్రిల్‌) 27.8, 16.8 శాతం మేర పెరగడంతో ఆదాయాలు స్వల్పంగా పెరిగినా సామాన్యుడి జేబుకి చిల్లుపడుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కన్య్జూమర్‌ అఫైర్స్‌ , ధరల పర్యవేక్షణ విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం నిరుటి మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలలో బియ్యం ధరలు సగటున 14.3 శాతం, గోధుమల ధరలు 6.4 శాతం పెరిగాయి. తృణధాన్యాల ధరలు ఏ మాత్రం తగ్గే అవకాశమే కనిపించటం లేదు. కూరగాయలు, నూనెల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగిపోయాయి. మరోవైపు హోల్‌సేల్‌ ధరల సూచి కూడా పైపైకే పోతోంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతానికి పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం గత 13 నెలల్లో ఇదే అత్యధికం కావటం గమనార్హం.

మరోవైపు దేశంలో రైతుల చేతిలో వున్న ఆహారోత్పత్తి వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాల పేరుతో పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా దీనిపై తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావటంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. రైతు ఉత్పత్తులకు మద్దతు ధరలు కల్పించి తీరవలసిన పరిస్థితిని సృష్టించే ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని ప్రధాని చేసిన వాగ్దానం నీటిమూటగానే మిగిలిపోయింది. మరోవైపు.. ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతానికి మించకుండా చూస్తానని ఆర్‌బిఐ చెప్పుకొన్నా అదీ ఆచరణలోకి రాలేదు. 2023 ద్వితీయార్థంలో ప్రభుత్వం కొన్ని ఆహార సరకుల ఎగుమతులను నిలిపివేయటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని చూసింది. ఈ క్రమంలో అదే ఏడాది జులై లో నాన్ బాస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించింది. తద్వారా దేశంలో బియ్యం ధరలు తగ్గుతాయని ఆశించింది. కానీ, అలాంటిదేమీ జరగకపోగా, బియ్యం ధరలు మరింత పెరిగాయి. దేశీయంగా ఉన్న ఆహార ధాన్యాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటపోవటం, నల్లబజారులో నిల్వలు పెరిగిపోవటం, కృత్రిమ కొరత సృష్టించే మాఫియాల ప్రభావమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా.. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతే, ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఈ ఆందోళనకరమైన ఆర్థిక గణాంకాలేవీ ఈ ఎన్నికల సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చోటు సంపాదించలేకపోవటం విచారకరం. జూన్ 4న పాత తీర్పు వస్తుందో లేక మార్పు గాలి వీస్తుందో పక్కనబెడితే, దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును మాత్రం ఇకనైనా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

-సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్‌ జర్నలిస్ట్‌)

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ