Samraksha Hospital: ప్రైవేట్ హాస్పిటళ్లకు ప్రాణాలు లెక్క కాదు.. పైసలే లెక్క. డబ్బులు అందితే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. లేదంటే పేషెంట్ ప్రాణానికేమైనా మాకు అవసరం లేదన్నట్టుగా ట్రీట్‌మెంట్ చేయరు. ఇక కొన్ని హాస్పిటళ్లు డబ్బులు సరిగ్గా తీసుకుని సరైన వైద్యం అందించక ప్రాణాలను తీస్తున్నాయి. వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్ నిండు ప్రాణాన్ని బలిగొందని బాధిత కుటుంబం ఆక్రోషిస్తున్నది. డెడ్ బాడీని సంరక్ష హాస్పిటల్ ముందు దహనం చేయడానికి ప్రయత్నించారు. హాస్పిటల్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.
ఏం జరిగింది?
మే 11వ తేదీన వాణి కిడ్నీ సమస్యతో వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌లో చేరింది. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని, మరో కిడ్నీ 90 శాతం బాగానే పని చేస్తున్నదని వివరించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ తొలగిస్తామని చెప్పారు. ఆపరేషన్ కూడా చేశారు. కానీ, సంరక్ష హాస్పిటల్‌లో వైద్యులు చేసిన ఆపరేషన్ వికటించింది. దినదినం ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటనే హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. సంరక్ష హాస్పిటల్ వైద్యులు చేతులెత్తేయడంతో బాధిత కుటుంబం ఆగ్రహించింది. హాస్పిటల్ ముందు ధర్నాకు దిగింది. దీంతో వాణి ప్రాణానికి తమదీ బాధ్యత అని చెప్పి.. యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. యశోద హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌కు డబ్బులు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు వాణిని యశోద హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. బాధిత కుటుంబమే రూ. 2 లక్షలు యశోద హాస్పిటల్‌లో చెల్లించడంతో వైద్యులు ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. మెల్లిగా ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు వైద్యులు చెప్పారు. ఆమె స్పృహలో లేకున్నా మెదడు, గుండె, ఇతర అవయవాలు సరిగా పని చేస్తున్నాయని వివరించారు. మూడు నాలుగు రోజులు యశోదలో ట్రీట్‌మెంట్ జరిగింది. కానీ, హామీ ఇచ్చిన మేరకు సంరక్ష హాస్పిటల్ యశోద హాస్పిటల్‌కు డబ్బులు చెల్లించలేదు. అప్పటికే రూ. 13 లక్షల బిల్లు అయినట్టు వాణి కూతురు తెలిపింది. బిల్లు కట్టకపోవడంతో యశోద హాస్పిటల్ డాక్టర్లు ట్రీట్‌మెంట్ నిలిపేశారని, తమ తల్లి మరణించిందని ఆరోపించింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, సీపీఆర్ చేసినా వాణి బతకలేకపోయిందని చెప్పిన వైద్యుల మాటలు అవాస్తవం అని పేర్కొంది.
వాణి కుటుంబం తీవ్ర ఆగ్రహావేశాలతో మృతదేహాన్ని వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. కట్టెలు హాస్పిటల్ ముందు పోగేసి దహనం చేయడానికి ప్రయత్నించారు. వాణి ప్రాణాలను సంరక్ష హాస్పిటల్ వైద్యులే తీశారని, అందుకే ఇక్కడే దహనం చేస్తామని అన్నారు. ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించి కేసు ఫైల్ చేశారు. గతంలోనూ సంరక్ష హాస్పిటల్ ఎదటు పలుమార్లు ఆందోళనలు జరిగాయి.
తమ తల్లిని చంపేసిన సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు జైలులో ఉండాలని, తమకు న్యాయం కావాలని కూతురు అన్నారు. వాణి చెల్లి మాట్లాడుతూ.. వాణికి ఇద్దరు కూతుళ్లని, తమ బావ గుండెపోటుతో రెండు రోజుల క్రితమే హాస్పిటల్ పాలయ్యాడని చెప్పుకొచ్చింది. తమ అక్క కుటుంబానికి తీరని అన్యాయం చేసిన సంరక్ష హాస్పిటల్ రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.