Wife Kills Husband: దేశంలో భార్య భర్తల బంధానికి ఎంతో పవిత్రత ఉంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన జీవిత భాగస్వామిని వదిలిపెట్టనని పెళ్లిలో ప్రమాణం చేస్తుంటారు. అందుకు తగ్గట్లే పూర్వకాలం నుంచి ఎంతో మంది భార్య భర్తలు.. తోడునీడగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో భార్య భర్తల బంధానికి సైతం బీటలు వారాయి. వివాహేతర సంబంధాల కారణంగా.. భార్య భర్తలు ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. వివాహేతర బంధం గురించి తెలుసుకున్న భర్తను ఓ భార్య అతి దారుణంగా హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య హత్య చేసిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అశోక్, యాదలక్ష్మీ భార్య భర్తలు. 14 ఏళ్ల క్రితం ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. యాదలక్ష్మీ గ్రామంలో కూలి పనులకు వెళ్తూ పిల్లలను చూసుకుంటోంది. మరోవైపు అశోక్ మాత్రం.. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వస్తుండేవాడు.
వివాహేతర సంబంధం..
అయితే భర్త దూరంగా ఉండటంతో.. యాదలక్ష్మీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఊరికి వచ్చిన అశోక్.. భార్య గురించి తెలిసి ఆమెను నిలదీశాడు. వాగ్వాదానికి దిగాడు. మరోమారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఏ పని చేసినా ఓ కన్ను వేసి ఉంచుతానని యాదలక్ష్మీతో తెగేసి చెప్పాడు. దీంతో కంగారు పడ్డ యాదలక్ష్మీ.. భర్తపై పీకల్లోతు కోపం పెంచుకుంది.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. ఇంటి ఓనర్ ఏం చేశాడో చూడండి!
కూతురి సాయంతో హత్య
గురువారం ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చిన అశోక్ ను ఎలాగైన హత్య చేయాలని యాదలక్ష్మీ నిర్ణయించుకుంది. ఇందుకు ఇంట్లోనే ఉన్న కూతురు సాయం కోరింది. ఆమె అంగీకరించడంతో యాదలక్ష్మీకి ఈ పని మరింత తేలిక అయ్యింది. నిద్రిస్తున్న భర్త మెడకు చీర బిగించి యాదలక్ష్మీ హత్య చేసింది. ఆపై తానంతట తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్యకు సంబంధించిన సమాచారం ఇచ్చింది. మృతుడు అశోక్ తండ్రి వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
