స్వేచ్ఛ, గద్వాల: RMP Doctors: సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి ధనార్జనే లక్ష్యంగా చేసుకోవడం వల్ల వాణిజ్య రంగంగా మారుతోంది. పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపోయినా మల్టీస్పెషాలిటీ దవాఖానలకు యజమానులుగా మారిపోతున్నారు.
హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది సైతం గ్రామాలలో ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఎంబిబిఎస్ ల తరహాలో వైద్యం అందిస్తున్నారు.డాక్టర్ కోర్సు చేసినవారిని ఆసరాగా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలో ‘వైద్య’ వ్యాపారం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యుల అర్హత విషయం దేవుడెరుగు.. ఎప్పుడైన వైద్యం వికటించి ఎవరి ప్రాణాలమీదికైనా వస్తే చూసుకుందాంలే అన్నట్లుగా పరిస్థితి మారింది.
నిబంధనలు ఇలా…
వైద్య రంగంలో నిబంధన ప్రకారం ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకూడదు. ఎవరైనా జ్వరంతో బాధపడుతూ వస్తే వారికి సాధారణ మాత్రలే ఇవ్వాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిఫార్సు చేయాలి. కొందరు ఆర్‌ఎంపీలు , పీఎంపీలు తమ పరిధి దాటి చికిత్సలు చేస్తున్నారు.
Also read: Hyderabad Crime: న్యాయవాది దారుణ హత్య.. రెక్కి చేసి మరీ..
ఎంబిబిఎస్ లా అవతారం ఎత్తి ప్రతి సమస్యకు ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. వీటివల్ల రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతోంది. గర్భిణులు, చిన్న పిల్లలకు ఎలాంటి చికిత్స చేయకూడదు. కమీషన్లకు కక్కుర్తి పడి సాధారణ డెలివరీ అయ్యే గర్భిణీలను సైతం ఏదో ఒకటీ మెలకబెట్టి మెరుగైన వైద్యం, సీరియస్ అయితే ఇబ్బంది, లైఫ్ రిస్క్ ఎందుకు అనే మాటలు చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను విధి లేని పరిస్థితుల్లోకి నెట్టుతున్నారు.
సమీపంలోని కర్నూలు, హైదరాబాదు, రాయచూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపి అక్కడి వైద్యులతో కమిషన్ మత్తులో మహిళల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు..మరో వైపు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ప్రజల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. దీంతో గర్భిణీలు కొడుకు పుట్టాలని హాస్పిటల్ కు వచ్చేందుకు మక్కువ చూపడం ద్వారా సిజరియన్లు చేసి అధిక ఫీజు వసూలు చేయవచ్చనే దురాలోచనతో హాస్పిటల్ ను నిర్వహిస్తున్నారన్న ఆరోపణ ప్రజల్లో బలంగా ఉంది.
Also read: Group 1 Revaluation: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు నోటీసులు.. తెరపైకి కొత్త వివాదం!
ఇటీవల జిల్లా కేంద్రంలో గర్భిణీలకు శస్త్ర చికిత్స ద్వారా డెలివరీ చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తి ఇద్దరు మరణించగా, మరో ఘటనలో ముక్కులో కండ పెరగగా దానిని తగ్గించేందుకు చికిత్స చేసే సమయంలో తీవ్ర అనారోగ్యం పాలవడంతో మెరుగైన వైద్యం కోసం అప్పటికప్పుడు కర్నూలు,హైదరాబాద్ కు తరలించినా మహిళ చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది.
దీంతో మహిళ బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. మరో సంఘటనలో గర్భిణీ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళ బంధువులు హాస్పిటల్ పై దాడి చేశారు. మరోవైపు ఫార్మసీ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకుని మందుల దుకాణాలు నిర్వహించడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ఇలాంటి డమ్మీ డాక్టర్లపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది.
Also read: Betting App Owners: బెట్టింగ్ యాప్స్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏకంగా 19మందిపై..
అధికారుల ఉదాసీన వైఖరి..
జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న వైద్య వ్యాపారంలో ఎన్నో లొసుగులు, అక్రమాలు బహిర్గతమవుతున్నా.. సంబంధిత శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం గమనార్హం. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తున్నది. ఫిర్యాదులు అందినా నామమాత్రపు తనిఖీలతో మమ అనిపించడం, వైద్య శాఖలో దీర్ఘకాలికంగా ఇక్కడే విధి నిర్వహిస్తూ మామూళ్ల మత్తులో మునిగి తేలడం రివాజుగా మారింది. దీంతో అక్రమార్కుల వైద్య దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో ఇంటి దొంగల తీరుతో ఆ శాఖకు మాయని మచ్చగా మిగులుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. : జిల్లా వైద్యాధికారి సిద్ధప్ప
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేని డాక్టర్లతో వైద్య సేవలు అందించినా తప్పే. ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వారిపై చర్యలు ఉంటాయి. ప్రజలెవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/