Warangal Murder Case: కామంతో కళ్లు మూసుకుపోయి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ తప్పును బయట పెట్టారని పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో 4 సంవత్సరాలు అదును కోసం చూసి.. ఆపై మాటు వేసి మట్టు పెట్టిన ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ములుగు జిల్లాకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
అసలేం జరిగిందంటే
ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈనెల 15 తేదిన రాత్రి 7 గంటలకు అదృశ్యమైన సాయి ప్రకాష్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శవమై తేలాడు. మృతిని చిన్నమ్మ నిర్మలే ఆమె ప్రియుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ తో కలిసి మర్డర్ చేయించినట్టు గ్రామస్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
నమ్మించి నయ వంచన
ములుగు జిల్లా వెంకటాపూర్ కు చెందిన చిడెం నిర్మలకు అక్కడే కానిస్టేబుల్ గా పని చేసిన శ్రీనివాస్ కు మధ్య పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. నాలుగేళ్ల క్రితం వీరి బాగోతం బయట పడడంతో కానిస్టేబుల్ శ్రీనివాల్ సస్పెండ్ అయ్యాడు. ఇందుకు సాయి ప్రకాషే కారణమని అతనిపై నిర్మల, శ్రీనివాస్ లు కక్ష్య పెంచుకున్నారు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని అందుకోసం చూస్తున్నారు.
నమ్మి వెళ్తే కిడ్నాప్
ఈ క్రమంలో ఈ నెల 15న సాయి ప్రకాష్ హత్యకు కుట్ర పన్నిన నిర్మల.. తన తండ్రికి కిడ్నీ నొప్పి అని చెప్పి అతడ్ని ఇంటికి రప్పించింది. దీంతో వారిని కారులో హనుమకొండకు తీసుకెళ్లాడు. అక్కడే సాయి ప్రకాష్ కిడ్నాప్ కు గురి అయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు 18న హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టగా కానిస్టేబుల్ శ్రీనివాస్ సుపారి గ్యాంగ్ తో కలిసి సాయి ప్రకాశ్ ను హత్య చేసినట్లు గుర్తించారు.
పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
హనుమకొండలో ఒంటరిగా దొరికిన సాయి ప్రకాష్ ను హత్య చేసిన.. మృతదేహాన్ని సిద్ధిపేట జిల్లాలోని జిల్లలగడ్డ గ్రామంలోని వ్యవసాయ బావిలో పడేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్యకు గురైన సాయి ప్రకాష్ సెల్ ఫోను ఆంధ్రకు వెళ్ళే ట్రైన్ లో పడేశారు. ఆ మొబైల్ ఏపీ లోని పాలకొల్లులో సిగ్నల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హనుమకొండ లో సీసీ కెమెరాల పుటేజ్ ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించినట్టు తెలుస్తోంది. బావిలో మృతదేహాన్ని గుర్తించిన హుస్నాబాద్ పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు.
Also Read: PSR Anjaneyulu Arrest: కాదంబరి జత్వాని కేసులో కీలక పురోగతి.. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్!
ఆత్మహత్యకు యత్నించిన నిర్మల
సాయి ప్రకాశ్ హత్య విషయం బయటకు రావడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్మల ప్రయత్నించగా ఆమె భర్త , మృతుడి బంధువులు, గ్రామస్తులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. నిర్మలను చెప్పులతో చితకబాదుకుంటూ ఈడ్చుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ప్రియుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ తో కలిసి నిర్మల మర్డర్ ప్లాన్ చేసినట్లుగా గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో కానిస్టేబుల్ తో సహా హంతక ముఠా ఉన్నట్లు తెలుస్తుంది.
వెంకటాపురంలో విషాదం
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా సంస్థ ద్వారా మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సాయి ప్రకాశ్ మృతి తో వెంకటాపురం మండలం లో విషాదం అలముకుంది. ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాష్ మృతి తీరని లోటని మండల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.