Simhachalam Temple: సింహాచలంలో ప్రతి యేటా అప్పన్న చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, ఈరోజు కూడా ఈ ఉత్సవాలు జరపడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, అంతలోనే చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు తెల్లవారుజామున క్యూలైన్లలో ఉన్న గోడ కుప్ప కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. రెండున్నర గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే టైంలో పవర్ కూడా పోవడంతో కొత్తగా కట్టిన గోడ కూలిపోయి ఈ ప్రమాదకర ఘటన జరిగింది.
ఇప్పటికే ఈ విషాదకర ఘటనలో 7 గురు చనిపోగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు మరో 15 మంది గాయాల పాలయ్యారు. చనిపోయిన మృత దేహాలను వెలికితీసి కేజీహెచ్‌కు తరలించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి షెడ్లు మొత్తం కూలిపోయాయి.నిద్రలో ఉన్నవారు నిద్రలోనే మరణించారు. ఈ చందనోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని చూడటానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు ఈ చందనోత్సవాన్ని చూడటానికి వస్తారు.
ప్రతి ఏడాది నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసిహ స్వామికి (Simhachalam Temple) చందనోత్సవం ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు స్వామిదర్శనం చేసుకోవడానికి సింహాచలం వెళ్తారు. ఇంతలోనే జరగకూడని ఈ ఘోర ప్రమాదం జరిగి విషాదాన్ని నింపింది.
సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
సింహాచలంలో గోడకూలిన ఘటన స్థలానికి హోంమంత్రి అనిత చేరుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందా అని ఆరా తీశారు. సింహగిరి బస్టాండ్ నుంచి వెళ్లే మార్గం మధ్యలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. క్షతగాత్రులను ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఈ ఘటనలో శిథిలాల కింద మరికొందరు ఉన్నారని తెలిసిన సమాచారం.
ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు.