Crime News: హుజురాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఐటీఐ సెకండియర్ చదువుతున్న మోరే రీషి(More Reishi) (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రీషి జమ్మికుంట పట్టణంలో ఐటీఐ(ITI) సెకండియర్ కోర్సు అభ్యసిస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. యువకుడి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దివ్యాంగుడైన తండ్రి, నిర్మాణంలో ఇల్లు
మోరే కుటుంబ నేపథ్యం మరింత విషాదకరంగా ఉంది. రీషి తండ్రి మోరే నాగరాజు(Nagaraju) తీవ్రమైన పైరాలసిస్ (పక్షవాతం) కారణంగా ఇంటికే పరిమితమై, మంచాన పడి ఉన్నారు. నిరుపేదలైన వీరు ఇటీవల తమ సొంత భూమిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద కొత్త ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చదువు ఒత్తిడా? లేక కుటుంబ సమస్యలా? మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Huzurabad News: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుకింగ్ తప్పనిసరి
ఇంద్రానగర్ కాలనీలో విషాదఛాయలు
ఘటనపై సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే యువకుడి మృతికి గల పూర్తి వివరాలు వెల్లడవుతాయని వారు స్పష్టం చేశారు. ఈ అకాల మరణం ఇంద్రానగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.
Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
