QR Code Theif: దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. కిరాణా షాపులు, సూపర్ మార్ట్స్ లో ఏ చిన్న వస్తువు కొన్నా గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pe) ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. షాపుల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి.. సెకన్ల వ్యవధిలో డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. దీనిని గమనించిన ఓ దొంగ సూపర్ ప్లాన్ వేశాడు. కస్టమర్లు చెల్లించే డబ్బును తెలివిగా దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సీసీటీవీలో అతడి ప్లాన్ మెుత్తం రికార్డ్ కావడంతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఆ దొంగ ఏం చేశాడు? ఎలా అడ్డంగా బుక్కయ్యాడు? ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
ఓ సూపర్ మార్కెట్ వద్ద క్యూఆర్ కోడ్ స్కానర్‌ను మార్చి నగదును తమ ఖాతాలోకి మళ్లించుకున్న విచిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా (Khammam District)లో చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్న సూపర్ మార్కెట్‌ను నడుపుతున్నాడు. షాపునకు వచ్చే కస్టమర్ల లావాదేవీల కోసం ఆయన షాపు ముందు క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఏర్పాటు చేశాడు.
సీసీ ఫుటేజీలో దొంగతనం..
ఈ నెల 7వ తేదీన గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి వెంకన్న ఖాతాకు చెందిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ (QR Code Scan)ను తొలగించాడు. దాని స్థానంలో తన క్యూఆర్ కోడ్‌ను అంటించి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వెంకన్న ఖాతాలో నగదు జమ కావడం లేదు. దీంతో అనుమానం వచ్చి ఆయన సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి పాత స్టిక్కర్‌ను తొలగించి, కొత్త స్టిక్కర్‌ను అతికించి వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయింది.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి 400 మెుబైల్స్.. ఒక్కసారిగా బ్యాటరీలు బ్లాస్ట్!
పోలీసులకు ఫిర్యాదు
దొంగ అంటించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా గ్రామానికి చెందిన ఓ మహిళ పేరు కనిపించింది. దీంతో షాపు యజమాని వెంకన్న ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. జరిగిన ఘటనపై వెంటనే తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
