Mahabubabad: కామంధులు రెచ్చిపోతున్నారు. చిన్న-పెద్ద, ముసలి – ముతక అన్న తేడా లేకుండా స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. లైంగిక దాడికి సంబంధించి కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో రూ.3 లక్షలకు సెటిల్ మెంట్ చేసుకున్నాడు.
అసలేం జరిగిందంటే?
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ తండాకి చెందిన మైనర్ బాలికపై ఉమేష్ అనే ఉన్మాది అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించకుండా.. పెద్ద మనుషుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో పంచాయతీ నిర్వహించిన పెద్ద మనుషులు.. మైనర్ బాలిక శీలానికి వెలకట్టారు.
రూ.3 లక్షలకు సెటిల్‌మెంట్
బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను నిందితుడు ఉమేష్.. పరిహారంగా రూ.3 లక్షలను బాధిత కుటుంబానికి అందించాలని పెద్ద మనుషులు తీర్పు ఇచ్చారు. ఆ డబ్బు వారికి అందజేసి సమస్యను సెటిల్ మెంట్ చేసుకోవాలని సూచించారు. మరోమారు బాలిక జోలికి వెళ్తే రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకు అంగీకరించిన ఉమేష్.. మెుదటి వాయిదా కింద రూ.లక్షను బాలిక కుటుంబానికి అందించాడు. ఇది కాకుండా పెద్ద మనుషుల ఖర్చు కోసం మరో రూ.50 వేలు కూడా ఇచ్చాడు.
బాలిక తల్లిదండ్రులకు వార్నింగ్
అయితే ఉమేష్ తో పాటు బాలిక తల్లిదండ్రులకు సైతం తండా పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే రూ.20 లక్షలు ఉమేష్ కు చెల్లించాలని తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే ఆ నోటా ఈ నోటా పాకి.. చివరికి ఈ ఘటన చైల్డ్ వెల్ ఫేర్ అధికారుల దృష్టికి చేరింది. తద్వారా ఆలస్యంగా అత్యాచారం ఘటన వెలుగుచూసింది. దీనిపై చైల్డ్ వెల్ ఫేర్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Private Travels: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం.. కనీస ప్రమాణాలు పాటించని ట్రావెల్స్
ఏపీలోనూ బాలికపై అత్యాచారయత్నం
మరోవైపు ఏపీలోని కాకినాడ జిల్లాలో మైనర్ బాలికపై 60 ఏళ్ల వయసున్న నారాయణరావు అనే వ్యక్తి ఇటీవల అత్యాచారయత్నం చేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి తోటలోకి తీసుకెళ్లగా.. ఓ వ్యక్తి గమనించి నిందితుడ్ని ప్రశ్నిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. నిందితుడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా తప్పించుకొని చెరువులోకి దూకేశాడని పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా చెరువులో నారాయణరావు మృతదేహాం లభ్యమైంది.
