staged accident? wife and children died in the incident except him in khammam | పథకం ప్రకారమే యాక్సిడెంట్?.. ప్రేయసి కోసం భార్య, పిల్లల హత్య?
Khammam Crime
క్రైమ్

Accident: పథకం ప్రకారమే యాక్సిడెంట్?.. ప్రేయసి కోసం భార్య, పిల్లల హత్య?

Khammam: ప్రియుడి కోసం భర్తను హత్యగావించి బాయ్‌ఫ్రెండ్‌ను ఆయన స్థానంలో తెచ్చి భర్తగా సమాజానికి పరిచయం చేయాలనుకున్న నేర ఘటన దేశాన్ని కదిలించింది. కిల్లర్ సూప్ అనే సినిమా కూడా వచ్చింది. ఇదే తరహా చర్చ ఇప్పుడు మరోసారి మొదలైంది. అయితే.. ఈ సారి భర్త.. ప్రేయసి కోసం భార్య, ఇద్దరు పిల్లల పాలిట కాలయముడిగా మారినట్టు చెబుతున్నారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత కేరళకు చెందిన యువతితో ప్రేమవ్యవహారం నడిపాడు. ఆ తర్వాత ప్రేయసి కోసం ఏకంగా భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిని చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రించాడని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం రఘునాథపాలెం మండలం బాబోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నారు. ఆయనకు కుమారి (25)తో పెళ్లి జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కృషిక (5), క్రితన్య (2) సంతానం. ఇద్దరూ బిడ్డలు కావడంతో బోడా ప్రవీణ్ అసంతృప్తితో ఉన్నాడని చెబుతున్నారు. కొన్నాళ్లుగా భార్యతోనూ గొడవకు దిగాడు. వీరికి తరుచూ గొడవలు జరిగాయి.

ఇదిలా ఉండగా హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ కేరళ యువతి బోడా ప్రవీణ్‌కు పరిచయమైంది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయమై కూడా కుటుంబంలో కలహాలు రేగాయి. పంచాయితీలు, పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చిన సందర్భాలు ఉన్నాయని కుమారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ కేరళ యువతితో బోడా ప్రవీణ్ కేరళకు వెళ్లి 20 రోజుల క్రితమే తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. పది రోజుల క్రితం కుమారి పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. బోడా ప్రవీణ్ కూడా ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఖమ్మంలోని మంచుకొండ నుంచి హర్యాతండాకు ప్రవీణ్ దంపతులు, ఇద్దరు కుమార్తెలు కారులో బయల్దేరారు. కాసేపటికే ఆ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఇది గమనించి ఆ రహదారి గుండా వెళ్లుతున్నవారు ఆగి కారులో నుంచి వారిని బయటికి తీశారు. అప్పటికే ఇద్దరు పిల్లలు కృషిక, తనిష్క మరణించారు. కుమారిని 108లో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా.. అప్పటికే మరణించారని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ మాత్రం స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న కుమారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకుని ఆందోళనకు దిగారు. ఒక పథకం ప్రకారం ప్రవీణ్ తమ బిడ్డను, ఇద్దరు పిల్లలను మర్డర్ చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. యాక్సిడెంట్‌లో మరణిస్తే వారికి కనీసం ఒంటిపై గాయాలు కూడా లేవని అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని, కేరళ యువతి కోసం ఆయన భార్య, పిల్లలను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశాడని అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఇది హత్యా? లేక ప్రమాదమా? అనేది తేలుతుందని వివరించారు.

కాగా, తాను కుక్కను అడ్డు తప్పించబోయానని, కానీ, కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిందని ప్రవీణ్ చెబుతున్నాడు.

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం