ఆదిలాబాద్: Bank Theft Case: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో దొంగతనానికి యత్నించిన ఘటన గతేడాది డిసెంబర్ లో సంచలనంగా మారింది. గ్యాస్ కట్టర్లతో బ్యాంకుకు కన్నం వేసి దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నించగా బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారం సైరన్ రావడంతో అక్కడినుండి పరారయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలను ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. ప్రజల మధ్యలోనే ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడుతూనే బ్యాంకు దొంగతనానికి యత్నించిన తొమ్మిది మందిలో ఇప్పటికే ముగ్గురు వివిధ కేసుల్లో అరెస్టు అయి జైల్లో ఉన్నారని, మరో ముగ్గురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
Also Read: Kamalapuram Students Failed: ఏమైందిరా.. మెుత్తం ఇలా కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారు..!
పట్టణంలోని వివిధ కాలనీ లకు చెందిన వీరంతా జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే క్రమంలో రామాయి బ్యాంకులోనూ దొంగతనానికి విఫల యత్నం చేశారన్నారు. ఇందులో ముగ్గురు కచ్ కంటి శివారులో రూరల్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా… బ్యాంకు దొంగతనానికి యత్నించింది తామేనని ఒప్పుకున్నట్లు వెల్లడించారు.
వారి నుండి కన్నం వేయడానికి వినియోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఏ 1 చౌహాన్ రవి, ఏ 2 సన్నీ, ఏ 4 గోవిందుడు కార్తీక్ ఇప్పటికే జైలులో ఉన్నారని, శనివారం సాయి కుమార్, రాజేశ్వర్, అశోక్ లను అరెస్టు చేయగా.. పుష్ప అలియాస్ పవన్, మనికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉన్నట్లు వివరించారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేనందున నిందితులను గుర్తించేందుకు సమయం పట్టిందని ఎస్పీ పేర్కొన్నారు
సాంకేతిక ఆధారాలతో వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, గ్రామీణ సీఐ ఫణిధర్, ఎస్ఐ ముజాయిద్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Sarees theft Case: అమ్మ బాబోయ్ కొత్తరకం దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!