TSNAB: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ భూతాన్ని అరికట్టడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిఘా పెంచి తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు. దీంతో డ్రగ్స్ ముఠాల గుట్టురట్టవుతున్నాయి. తాజాగా, మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 గ్రాముల ఎండీఎంతోపాటు 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ దుర్గం చెరువు సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని టీఎస్‌ఎన్ఏబీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా స్పాట్‌కు చేరుకుని వీరిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చే ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. సుమారు 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. తాజాగా సాయిచరణ్‌తోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసింది. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్‌లలోని వ్యాపారవేత్తలకూ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.