phone tapping case prime accused prabhakar rao may come to india today | Phone Tapping: ఇండియా వస్తున్న ప్రభాకర్ రావు?
Prabhakar Rao
క్రైమ్

Phone Tapping: ఇండియా వస్తున్న ప్రభాకర్ రావు?

Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ఇండియాకు వస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26వ తేదీతో ప్రభాకర్ రావు వీసా గడువు ముగియనున్నట్టు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో ఇది వరకే తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారించడానికి పోలీసులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ ప్రభాకర్ రావు ఇండియాలో అడుగుపెడితే.. మరుక్షణమే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నది. ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లోకి తీసుకోవడానికి సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే, అనారోగ్యం కారణంగా వీసా గడువును ప్రభాకర్ రావు పెంచుకునే అవకాశాలూ లేకపోలేవు. ఇందుకోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టూ తెలుస్తున్నది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం రేపింది. ఎస్ఐబీ పోలీసులు అసాంఘిక శక్తులపై నిఘా పెట్టడం కంటే కూడా వేరే వారిపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం, ఎన్నికల్లోనూ ప్రత్యర్థులకు అడ్డంకులు సృష్టించడానికి వీరిని ఉపయోగించినట్టు వార్తలు ఉన్నాయి. అంతేకాదు, వ్యాపారవేత్తలు, ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు పోలీసు అధికారులు తొంగిచూసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారు. అయితే, ఆయన అనారోగ్య కారణాల రీత్యా అమెరికాకు వెళ్లినట్టు తెలిసింది. మరికొంత కాలం అమెరికాలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆయన తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును విదేశీ దర్యాప్తు సంస్థల సహాయంతో పట్టుకుని స్వదేశానికి తీసుకురావాలనీ పోలీసులు భావించారు. ఇందుకోసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రభాకర్ రావుతోపాటు శ్రవణ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ, ప్రభాకర్ రావును విచారించే విషయంలో పురోగతి సాధించలేకపోయారు. కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు ఆయన ఇండియాకు తిరిగి రావాలి. ఒక వేళ వీసా గడువు పెంచుకుంటే.. పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటికి సస్పెన్స్.

ఇది వరకే ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. అయితే, ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు