– ఏదీ దాచొద్దు.. అన్నీ చెప్పాలి
– మీ ప్రతిమాటనూ రికార్డు చేస్తున్నాం
– ఆధారాల కోసమే అఫిడవిట్లు
– ఆదేశాలిచ్చిన వారినీ పిలుస్తాం
– కాళేశ్వరం నిర్మాణ సంస్థల ప్రతినిధులతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ
PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలనే ఆదేశాలమేరకే పనిచేశామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు, కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై, వారిని అడిగినట్లు జస్టిస్ ఘోష్ వివరించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినట్లు తెలిపారు. తప్పుడు అఫిడవిట్, ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ ఆరా తీసింది. అనంతరం కమిషనర్ జస్టిస్ పీసీ ఘోష్ మాట్లాడుతూ.. గత బ్యారేజీల నిర్మాణం, డిజైన్ కు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, బాధ్యులైన వారెవరినీ వదలబోమని హెచ్చరించారు. ఆయా కంపెనీల ప్రతినిధుల సమాచారాన్ని జూన్ నెలాఖరు నాటికి అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొనేందుకే అఫిడవిట్ ఫైల్ చేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం గడువులోగా పనులు పూర్తి చేయాలని తమను బాగా ఒత్తిడి చేసిందని, డెడ్ లైన్ కూడా విధించటంతోనే తాము వేగంగా పనులు పూర్తి చేశామని ఏజెన్సీల ప్రతినిధులు వెల్లడించారని ఆయన వెల్లడించారు.
ఎవరి ఆదేశాల మేరకు హడావుడిగా పనులు చేశారో తెలిశాక వారినీ విచారణకు పిలుస్తామని కమిషనర్ తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన కొందరు అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లు ఔట్ ఆఫ్ స్టేషన్ అని చెబుతున్నారని, వాళ్లను కూడా విచారించాల్సి ఉందని ఘోష్ తెలిపారు. కాగ్, విజిలెన్స్ రిపోర్టులు అందాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. వారినీ విచారిస్తామని అన్నారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే తమకు తెలిసిపోతుందని, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. కాగా ఇప్పటికే 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారించి, అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు వెల్లడించాలని పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో వారికి సైతం జూన్ 25లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.