Women Death Case: 11 తులాల నగలతో ఉడాయించిన నిందితుడు
మిస్టరీ కేసుని చేధించిన నాచారం పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అమ్మా…అమ్మా అని పిలిచి దగ్గరయ్యాడు. కానీ, బంగారు నగల కోసం దారుణంగా హత్య (Women Death Case) చేశాడు. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మృతదేహాన్ని స్నేహితుల సాయంతో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి గోదావరి నదిలోకి విసిరేశాడు. మిస్సింగ్ ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. హత్య చేసిన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నాచారం ఇన్స్‌పెక్టర్ ధనుంజయ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మల్లాపూర్ ప్రాంతంలోని బాబానగర్ వాస్తవ్యురాలు సుజాత (65). భర్త, కొడుకులు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఒంటరిగా ఉంటోంది.
తన ఇంట్లోని పలు గదులను అద్దెకిచ్చి వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతోంది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి నివాసి అంజిబాబు (33) ఆమె ఇంట్లోని ఓ పోర్షన్‌లో అద్దెకు దిగాడు. తాను డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. వృద్ధురాలైన సుజాతను అమ్మా అని పిలుస్తూ కొన్నిరోజుల్లోనే సన్నిహితుడిగా మారిపోయాడు. కాగా, సుజాత నిత్యం బంగారు నగలు ధరించి ఉండేది. వాటిపై కన్ను పడటంతో ఎలాగైనా సరే ఆ నగలు దొంగిలించాలనుకున్నాడు. ఈనెల 19న రాత్రి సుజాత ఇంట్లో వంట చేస్తుండగా వెనక నుంచి వెళ్లి గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత సుజాత ఒంటిపై ఉన్న 11 తులాల బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి సొంతూరుకు ఉడాయించాడు. ఆ తరువాత మృతదేహాన్ని అలాగే వదిలేస్తే చేసిన నేరం బయట పడుతుందని భావించిన అంజిబాబు తన స్నేహితులైన యువరాజు, దుర్గారావుకు చేసిన హత్య గురించి చెప్పాడు.
Read Also- Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?
మృతదేహాన్ని మాయం చేయటంలో తనకు సహకరించాలని కోరాడు. కొంత డబ్బు ఇస్తానని ఆశ పెట్టాడు. దాంతో యువరాజు, దుర్గారావులు అతనికి సహకరించటానికి ఒప్పుకొన్నారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి ఓ కారును అద్దెకు తీసుకుని హైదరాబాద్ వచ్చారు. వస్తూ వస్తూ ఓ పెద్ద ట్రావెల్ సూట్ కేస్‌ను తెచ్చుకున్నారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి కారు డిక్కీలో పెట్టి పరారయ్యారు. కాగా, ఈనెల 24న సుజాత చెల్లెలు సువర్ణలత అక్క ఇంటికి వచ్చింది. సుజాత కనిపించక పోవటంతో అద్దెకు ఉంటున్న వారిని ఆమె గురించి ఆరా తీసింది. 19వ తేదీ రాత్రి నుంచి కనిపించటం లేదని వాళ్లు చెప్పటంతో నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో ప్రశ్నించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంక వద్ద గోదావరి నదిలోకి విసిరేసినట్టు చెప్పాడు. ఈ క్రమంలో అతడితోపాటు మృతదేహాన్ని తరలించటంలో సహకరించిన యువరాజు, దుర్గారావులను కూడా అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లాకు వెళ్లి అప్పనపల్లి-కే.ఏనుగుపల్లి మధ్య గోదావరి నుంచి సుజాత మృతదేహాన్ని వెలికి తీశారు.
Read Also- Battle of Galwan: గల్వాన్ సినిమాపై చైనా అక్కసు.. భారత్ స్ట్రాంగ్ రియాక్షన్.. డ్రాగన్‌కు చురకలు!

