East Godavari district: కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తే దానికి మించిన పుణ్యం మరొకటి ఉండదని పెద్దలు చెబుతుంటారు. కష్టం అంటూ వచ్చిన వారిని ఆదుకోవడంలోనే నిజమైన మానవత్వం ఉంటుందని చెబుతుంటారు. సాయం పొందిన వారు సైతం ఇచ్చిన వ్యక్తిని దేవుడిలా భావిస్తుంటారు. రోడ్డుపై ఎక్కడ కనిపించినా ఆరాధన భావంతో ఉంటారు. కానీ ఓ వ్యక్తి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కష్టంలో సాయం చేసిన వ్యక్తిని ఓ దుర్మార్గుడు కాటేశాడు. ఏకంగా ప్రాణాలు తీసేశాడు.
అసలేం జరిగిందంటే!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొవ్వురు మండలంలో గత నెలలో దారుణ హత్య జరిగింది. మార్చి 26వ తేదీ రాత్రి పెండ్యాల ప్రభాకర్ రావు అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎవరు ఇలా చేశారని స్థానికులు చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఎవరు చంపారంటే?
పెండ్యాల ప్రభాకర్ ను హత్య చేసిన దుండగులు ఆయన కుడి చేతి మణికట్టును నరికి ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమైనట్లు తేల్చారు. మృతుడు పెండ్యాల రాంబాబును చుక్కా రామ శ్రీనివాస్ హత్య చేసినట్లు గుర్తించారు.
Also Read: Domestic Violence Survey: భార్యతో గొడవ పడుతున్నారా? ఈ సర్వే చూస్తే ఆ ధైర్యం చేయరు!
అప్పు అడిగినందుకు హత్య!
మృతుడు పెండ్యాల ప్రభాకర్ రావు వద్ద రూ.24,000ను నిందితుడు చుక్కా రామ శ్రీనివాస్ అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ప్రభాకర్ రావు అడుగుతుండటంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మరో ఇద్దరితో కలిసి రామ శ్రీనివాస్ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. మాట్లాడదామని చెప్పి పొలంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపినట్లు తేల్చారు.
చేతిని ఎందుకు నరికారంటే!
ప్రభాకర్ చనిపోయినా కూడా మణికట్టును ఎందుకు నరికారన్న ప్రశ్నకు సైతం పోలీసులు దర్యాప్తులో సమాధానం వచ్చింది. ప్రభాకర్ ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దుండగులు ఆపై.. చేతికున్న ఉంగరాలు, కడియం తీసుకోవాలని ప్రయత్నించారు. ఎంతకీ అవి రాకపోవడంతో మణికట్టును తెగ నరికారు.
ముగ్గురూ అరెస్ట్
ప్రభాకర్ ను హత్య చేసిన ముగ్గురు వ్యక్తులనూ అరెస్టు చేసినట్లు కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ తెలిపారు. నిందితుల నుంచి 36 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లు రెండు మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై హత్యానేరం కింద సెక్షన్లు పెట్టినట్లు వివరించారు.