Alcohol Seized: గోవా ట్రిప్‌నకు వెళ్లిన ఓ వ్యక్తి, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా మద్యం కొనుగోలు చేసి కారులో తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా అడిసెపల్లి గ్రామానికి చెందిన జయంత్ రెడ్డి(Jayanth Reddy)ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో గోవా పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించి, తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరే సమయంలో, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది.
నిందితుడిపై కేసులు నమోదు
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జయంత్ రెడ్డి, ఓటర్లకు పంచిపెట్టడం కోసం 112 ఫుల్ బాటిళ్లు, 50 హాఫ్ బాటిళ్ల మద్యాన్ని కొనుగోలు చేశాడు. దాంతోపాటు 330 ఎంఎల్ బీరు బాటిళ్లను కూడా తీసుకున్నాడు. వాటిని తన కారులో జాగ్రత్తగా దాచి హైదరాబాద్(Hyderabad)కు బయలుదేరాడు. అయితే, జహీరాబాద్‌లోని చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద సంగారెడ్డి డీటీఎఫ్ టీం ఎస్ఐ హన్మంతు, జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులతో కలిసి కారును ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో భారీగా ఉన్న గోవా మద్యం సీసాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Minister Ponnam Prabhakar: ఉప ఎన్నికపై మంత్రి సంచలన కామెంట్స్!