Land Grabbing: ఓ భూ యజమానిని కిడ్నాప్ చేసి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ముఠాపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏసీపీ, తహశీల్దార్ కూడా ఉన్నారు. గతేడాది చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేరం జరగడానికి గత ప్రభుత్వంలోని ఓ పెద్ద మనిషి సహకరించినట్టు బాధితులు ఆరోపించారు. అందువల్లే ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ మోకిలా పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.
సైబరాబాద్ మోకిలా పోలీసు స్టేషన్‌లో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ, తలకొండపల్లి తహశీల్దార్‌లతోపాటు 13 మంది పై కేసు నమోదైంది. రూ. 30 కోట్ల విలువ చేసే భూమి యజమానిని కిడ్నాప్ చేశారు. ఆయనతోనే ఆ భూమిని ఓ ముఠా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ కిడ్నాప్‌నకు ఏసీపీ సహకరిస్తే, రిజిస్ట్రేషన్‌కు తహశీల్దార్ సహకరించారని ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్ 15న కిడ్నాప్ చేస్తే.. 16వ తేదీన బలవంతంగా తనతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఈ కిడ్నాప్ స్కెచ్ వెనుక గత ప్రభుత్వంలోని కీలక నాయకుడు ఉన్నారు. కేసు బయటకు పొక్కకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. కేసును నిర్వీర్యం చేశారు. కీలక వ్యక్తులను కేసు నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు. అప్పటి పోలీసు అధికారులను ప్రభావితం చేసి కేసును పక్కదారి పట్టించారు.
Also Read: కవిత అరెస్టుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. అంత మాట అనేశారేంటి..?
ఏసీపీకి ముందస్తు బెయిల్ తెచ్చుకునే సమయాన్ని అప్పటి పోలీసులు ఇచ్చారని తెలిసింది. తహశీల్దార్‌ను నిందితుడిగా చేర్చలేదు. ఆ కీలక నాయకుడికి సన్నిహితుడైన సుబ్బరాజుపై సాక్ష్యాలు ఉన్నా ఆయనపై కేసు ఫైల్ కాలేదు.
ఈ నేపథ్యంలో సర్కారు మారిన తర్వాత బాధితులు సైబరాబాద్ కమిషనర్‌ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో తహశీల్దార్‌ను కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు పంపినట్టు తెలిసింది.