– 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజ్‌కు జస్టిస్ ఘెష్ కమిషన్
– కాళేశ్వరం ప్రాజెక్టుపై 54 ఫిర్యాదులు
– ఇంజినీర్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు త్వరలో నోటీసులు
– 7న మూడు బ్యారేజీలను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్
Justice Pinaki ChandraGhosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు చేయడానికి ఏర్పడ్డ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదులు చేయడానికి ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో జస్టిస్ చంద్రఘోష్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. 7వ తేదీన ఆయన అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ నెల 10వ తేదీలోగా బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఘోష్ కమిషన్ కోరింది. ఈ పనుల పురోగతినీ ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించనున్నారు. ఇది వరకే నిపుణుల కమిటీ ఈ బ్యారేజీల వద్దకు వెళ్లి పరిశీలించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదులకు మే 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది కమిషన్. గడువు ముగియడంతో వచ్చిన ఫిర్యాదులను లెక్కించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై 54 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను జస్టిస్ ఘోష్ కమిషన్ పరిశీలించనుంది. ఈ నెల రెండో వారంలో లేదా మూడో వారంలో బ్యారేజీ నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, ఇంజినీర్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నది.
మంత్రి ఉత్తమ్ పర్యటన:
మూడు బ్యారేజీల వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజీలను పరిశీలించనున్నారు. 7వ తేదీన మధ్యాహ్నం చాపర్ ద్వారా సుందిళ్లకు చేరుకుంటారు. అక్కడ బ్యారేజీని పరిశీలించి అన్నారం బ్యారేజీ చేరుకుంటారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు బ్యారేజీల వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతిని ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం పరిశీలించనుంది. ఈ పనుల పురోగతిని మరమ్మతులు చేపడుతున్న ఎల్ అండ్ టీ, ఆఫ్‌కాన్స్, నవయుగ ఏజెన్సీల మేనేజ్‌మెంట్ ప్రతినిధులు మంత్రికి వివరిస్తారు. బ్యారేజీల మరమ్మతులు, చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీల పరిస్థితులను తెలియజేస్తారు.