Fake Gold Scam: రూ.12 లక్షలకు ఘరానా మోసం
అంతరాష్ట్ర నిందితుడు అరెస్ట్
వివరాలను వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు
నల్గొండ, స్వేచ్ఛ: అమాయకులను టార్గెట్ చేసి, వారి వివరాలను ముందుగా సేకరించి, పరిచయం చేసుకుంటారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ శాంపిల్‌గా నిజమైన గోల్డ్ ఇస్తారు. మిగతా బంగారమంతా ఫేక్ అంటగట్టి మోసగిస్తున్న ముఠాలో (Fake Gold Scam) ప్రధాన అంతరాష్ట్ర నిందితుడిని గురువారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర రాజు ఫేక్ గోల్డ్ కేసు వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కారపు శ్యాం సుందర్ మే నెల మొదటి వారంలో తన స్నేహితుడితో కలిసి ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు కారులో వెళ్లారు. తిరిగి సొంత ప్రాంతానికి బయలుదేరే క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని నార్కెట్ పల్లి – అద్దంకి బైపాస్‌పై ఉన్న ఉషారాణి దాబా హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కుడ్లిగి మండలం హురులికల్‌కు చెందిన గోవిందప్ప… బాధితుడైన శ్యాంసుందర్‌ను పరిచయం చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
Read Also- Local Body Elections: స్థానిక ఎన్నికలకు భద్రతపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదన ఇదే
తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మించాడు. ఈ క్రమంలో కర్ణాటక స్టేట్ హోస్‌పేట్ పరిధి బనికల్ తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్ ప్రకారం కుండలో ఉంచిన ఫేక్ బంగారు నాణేల నుంచి రెండు ఒరిజినల్ గోల్డ్ నాణేలను ఇచ్చారు. దీంతో కుండలో ఉన్న బంగారం మొత్తం నిజమైనదేనని నమ్మించారు. ఈ క్రమంలో మే నెల మూడవ వారంలో మిర్యాలగూడకు చేరుకున్న గోవిందప్ప ముఠా సభ్యులు హడావిడిగా సి శ్యాంసుందర్‌కు ఫేక్ గోల్డ్ అప్పగించి, అతడి నుంచి రూ. 12 లక్షలను తీసుకున్నారు. గోవిందప్ప, అతడి అనుచరులు కారులో వెళ్లిపోయారు. బాధితుడిని భయభ్రాంతులకు గురిచేసి నకిలీ బంగారం అంటగట్టిన విషయమై శ్యాంసుందర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చేధించినట్లు చెప్పారు.
Read Also- NC24 Update: ‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో చూశారా? టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?
పట్టణంలోని అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై చేపట్టిన తనిఖీల్లో అంతరాష్ట్ర నిందితుడైన గోవిందప్ప పట్టుబడుగా, ఇతర ముఠా సభ్యులైన మహేష్, లోహిత్, నాగప్ప, ప్రసన్న గంగప్పలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదు, 200 గ్రాముల ఫేక్ గోల్డ్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ సోమ నరసయ్య, ఎస్ఐ లు రాంబాబు, విజయ్ కుమార్, సీసీ ఎస్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, పుష్పగిరి, వెంకట్, మహేష్, సాయి, రామకృష్ణ, లక్ష్మయ్య, రాజశేఖర్‌లను డీఎస్పీ అభినందించారు.

