Illigal proparties case acp umamaheswararao in acb custody:
ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుకు సంబంధించి అరెస్టయ్యి చంచల్‌గూడ జైలులో ఉన్న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ బుధవారం కస్టడీలోకి తీసుకుంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టును కోరారు. అందుకు న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో బుధవారం ఉమామహేశ్వరరావును అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు.
ఆ డైరీలో అధికారుల పేర్లు
ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ నెల 22న ఉమామహేశ్వరరావు అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆ తరువాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉమామహేశ్వరరావును ఎసిబి కస్టడీలోకి తీసుకుంది. ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించనున్నారు. మూడు రోజుల పాటు కస్టడీలో ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన బినామీ డాక్యుమెంట్లపై ఏసీబీ ఆరాతీయనున్నారు. ఉమామహేశ్వరరావు డైరీలో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు సమాచారం.