తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Theft Amount: పిక్ పాకెటర్లు చేతి వేళ్లు సగానికి విరగ్గొట్టిన రేజర్ బ్లేడ్లే వాళ్ల పెట్టుబడి. రెప్పపాటులో లక్ష్యంగా చేసుకున్న వారి పర్సు కొట్టేస్తారు. లేదా జేబులోని మొబైల్ ఫోన్ ను అపహరిస్తారు. అంతేనా టార్గెట్ గా చేసుకున్న వ్యక్తిని ఇద్దరు ముగ్గురు కలిసి చుట్టుముట్టి కన్ ఫ్యూజ్ చేసి మెడలో ఉండే బంగారు గొలుసులను అపహరిస్తారు. పని పూర్తి కాగానే చల్లగా జారుకుంటారు. పోలీసు వర్గాలు చెబుతున్న ప్రకారమే ఈ జేబు దొంగల టర్నోవర్ సంవత్సరానికి వంద కోట్ల రూపాయలకు ఉంటోందంటే వీరి స్వైర విహారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే నిండా పదిహేనేళ్లు కూడా మైనర్లను గ్యాంగుల్లో చేర్చుకుని వారికి శిక్షణ ఇచ్చి మరీ నేరాలు చేయిస్తుండటం.
ఇరవైకి పైగా గ్యాంగులు
టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ లోనే ఇరవైకి పైగా పిక్ పాకెటింగ్ గ్యాంగులు యాక్టీవ్ గా ఉన్నాయి. ఒక్కో ముఠాలో పది నుంచి ఇరవై మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరిలో కనీసం ముగ్గురు మైనర్లు ఉంటున్నారు. ఇక, ఈ ముఠాలు హైదరాబాద్ ను ఏరియాల వారీగా పంచుకుని నేరాలు చేస్తున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే రైల్వే, బస్ స్టేషన్లలో కొన్ని గ్యాంగులు జేబు దొంగతనాలు, సెల్ ఫోన్ చోరీలు, బంగారు గొలుసులను తస్కరిస్తుంటే మరికొన్ని గ్యాంగులు ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండే బస్సు రూట్లలో తిరుగుతూ పని కానిచ్చేస్తున్నారు. ఇక,సభలు,సమావేశాలు,పార్టీల ఆఫీసుల్లో మీటింగులు ఉంటే వీరికి పండుగే. జనంలో కలిసిపోయి అదను చిక్కగానే అవతలివారి జేబుల్లో నుంచి పర్సులు, మొబైల్ ఫోన్లను అపహరిస్తున్నారు.
కనీసం 4గురు కలిసి
అది బస్సయినా, రైలైనా, బహిరంగ సభ అయినా, పార్టీ ఆఫీసుల్లో మీటింగులైనా కనీసం నలుగురు కలిసి నేరాలకు పాల్పడుతుంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. గ్యాంగులో ఉండే ఒకడు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి దృష్టిని మరలిస్తే మరొకడు సెకన్ల వ్యవధిలో సెల్ ఫోలో, పర్సో, మెడలోని బంగారు గొలుసూ కొట్టేస్తాడు. ఆ వెంటనే కొట్టేసిన సొత్తును ముఠాలోని మరో సభ్యునికి అందిస్తాడు. అతను దాంతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎవ్వరికీ అనుమానం రాదని మైనర్లతో జేబులు కొట్టిస్తుండటం. ట్రై కమిషనరేట్లలో ప్రతీరోజూ నలభైకి తగ్గకుండా జేబు దొంగతనాలు జరుగుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రతీ పిక్ పాకెటింగ్ గ్యాంగుకు ఓ లీడర్ ఉంటాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. నేరానికి పాల్పడుతూ ఎవరైనా దొరికిపోతే సదరు గ్యాంగ్ లీడర్ రంగంలోకి దిగుతాడని పేర్కొన్నారు. న్యాయవాదులతో మాట్లాడి కోర్టుల నుంచి అరెస్టయిన వారికి బెయిల్లు మంజూరు చేయిస్తుంటారన్నారు. దాంతోపాటు అరెస్టయిన వ్యక్తి బయటకు వచ్చే వరకు అతని కుటుంబానికి ఏ అవసరం వచ్చినా సదరు గ్యాంగ్ లీడరే చూసుకుంటాడన్నారు.
Also Read: Damodar Raja Narasimha: అడుగడుగునా అక్రమాలు.. సూపరిండెంట్ పై మంత్రి ఫైర్!
ఈ పనులు చేసి పెట్టినందుకుగాను పిక్ పాకెటర్లు తాము కొట్టేసిన సొత్తు నుంచి కొంత భాగాన్ని గ్యాంగ్ లీడర్లకు ఇస్తుంటారని వివరించారు. పిక్ పాకెటింగ్ నేరాల్లో తేలికగా బెయిల్లు లభిస్తుండటం, నేర నిరూపణలు పెద్దగా జరగక పోతుండటం, కొన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నా కఠినంగా ఉండక పోతుండటంతో ఈ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదని పోలీసు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. జేబు దొంగతనాలకు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.
అయితే, వందలో తొంభై కేసుల్లో నేర నిరూపణే జరగటం లేదని చెప్పారు. అరెస్టయిన నెల రెండు నెలలలోపే నిందితులు బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారని తెలిపారు. ఆ వెంటనే నేరాలు చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనంగా ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన షేక్ సద్దాం హుస్సేన్ ఉదంతాన్ని ప్రస్తావించారు. రాజేశ్ అనే వ్యక్తితోపాటు మరికొందరిని సభ్యులుగా చేర్చుకుని సద్దాం హుస్సేన్ ఏడాది కాలంలోనే 46 నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు.
ఈ క్రమంలో కొన్నిసార్లు అరెస్ట్ కూడా అయ్యాడని చెప్పారు. ఆ తరువాత కొన్నిరోజులకే బెయిల్ పై బయటకు వచ్చి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడన్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఒకరితో మాట్లాడగా డెకాయ్ ఆపరేషన్లు చేస్తే జేబు దొంగలను కొంత మేర కట్టడి చేయవచ్చన్నారు. అయితే, ఇప్పటికే పరిమితికి మించిన విధులతో నలిగిపోతున్న పోలీసు సిబ్బంది డెకాయ్ ఆపరేషన్లు జరిపే పరిస్థితి లేదన్నారు.
Also Read: Formula e Race Case: జైలుకు వెళ్లనున్న కేటీఆర్?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!