Hyderabad City: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారికి తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు రౌడీ షీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు షాకిచ్చారు. వారిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎల్బీ నగర్ (LB Nagar) ప్రాంతానికి చెందిన నలప రాజు రాజేష్ (33), మెంటల్ రాజేష్(19).. రౌడీయిజం చెలాయిస్తూ స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారు నిజంగానే స్థానికంగా సమస్యలు సృష్టించినట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన మెంటల్ రాజేష్ పై 19 కేసులతో పాటు 4 హత్య కేసులు ఉన్నట్లు తేల్చారు. దీంతో వారిద్దరిని నగరం నుంచి వెలివేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Pamban Bridge: పంబన్ వంతెన లాంచ్ కు రంగం సిద్ధం.. ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
అలాగే మీర్ పేటకు (చెందిన సురేందర్ అలియాస్ సూరి సైతం హైదరాబాద్ నుంచి సీపీ బహిష్కరించారు. అతడిపై 21 కేసులు ఉన్నట్లు తెలిపారు. సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం వారిని నగరం నుంచి కొన్ని రోజులపాటు వెలివేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. వారు నగరంలోకి రావాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. నగరంలో నేరస్తులకు స్థానం లేదన్న సీపీ.. శాంతి భద్రతలే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.