MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితురాలిగా ఉన్న హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వేటు వేసింది. హేమను సస్పెండ్ చేస్తూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని హేమకు తొలుత మా నోటీసులు పంపింది. కానీ, హేమ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మా నుంచి ఆమెను మంచు విష్ణు మా నుంచి సస్పెండ్ చేశారు. హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మంచు విష్ణు మా సభ్యులకు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.
బెంగళూరు రేవ్ పార్టీలో హేమ మారుపేరుతో పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ లభించడంతో అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. హేమను విచారణకు హాజరుకావాలని సమన్లు పంపినా ఆమె కుంటిసాకులు చెబుతూ తప్పించుకున్నారు. దీంతో ఆమె పై విమర్శలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఆమె చేస్తున్న పోస్టులతో విమర్శలపాలయ్యారు. నిన్న సాయంత్రం ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ కేసులో హేమ పేరు ప్రముఖంగా వినిపించడంతో మా సభ్యుల్లో కొందరు ఆమెపై సస్పెన్షన్ వేటు వేయాలనే డిమాండ్‌ను తెచ్చారు. దీనిపై మంచు విష్ణు ఇతర సభ్యులతో చర్చ ప్రారంభించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఎక్కువ మంది సభ్యులు ఆమె పై వేటు వేయడమే సరైందనే అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. దీంతో మంచు విష్ణు హేమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆమెకు క్లీన్ చిట్ లభించే వరకు ఈ సస్పెన్షన్ వేటు అమల్లో ఉంటుంది.
ముగియనున్న కస్టడీ
రేవ్ పార్టీ కేసులో హేమను 24 గంటల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి హేమ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. నిన్నటి నుంచి ఆమెను విచారిస్తున్నారు. మరికాసేపట్లో ఆమె కస్టడీ ముగియనుండగా వైద్య పరీక్షలు నిర్వహించి హేమను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. రేవ్ పార్టీకి సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు ఆమె నుంచి రాబట్టినట్టు తెలుస్తున్నది. మరో నలుగురితో కలిసి ఆమె రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. డ్రగ్స్ సప్లయర్లతో ఆమెకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు ఆమె తన పేరు, మొబైల్ నెంబర్ తప్పుగా చెప్పి దొరికినట్టు తెలిసింది.
