Panipat Murder: హర్యానాలోని (Haryana) పానిపట్‌లో షాకింగ్ హత్యోందతం (Panipat Murder) వెలుగుచూసింది. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదన్న అసూయతో ఓ మహిళ ఏకంగా నలుగురు చిన్నపిల్లలను చంపేసింది. తాజాగా, తన మేనకోడలి హత్య చేసి, దొరికిపోవడంతో ఈ దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. నిందితురాలి పేరు పూనమ్ అని పోలీసులు బుధవారం ప్రకటించారు. సోమవారం సోనిపట్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరితో పాటు సోనమ్ కూడా హాజరైందని, కుటుంబ సభ్యులంతా పెళ్లి హడావుడిలో ఉన్న సమయంలో 6 ఏళ్ల వయసున్న తన మేనకోడలిని నీటి తొట్టెలో ముంచి చంపిందని పోలీసులు వివరించారు. పూనమ్ గతంలో మరికొందరు పిల్లల్ని హత్య చేసిందని, 2023లో తన సొంత కొడుకు, మరో ఇద్దరు పిల్లలను ఇదే రీతిలో నీటిలో ముంచి హత్య చేసిందని ప్రకటించారు. ఈ షాకింగ్ విషయాలు తెలిసి, కుటుంబ సభ్యులతో పాటు మిగతావారంతా షాక్‌కు గురవుతున్నారు.
వామ్మో.. ఎప్పుడు హత్య చేసిందంటే?
హత్యకు గురైన చిన్నారి కుటుంబం సోనిపట్‌కు చెందినవారు. పానిపట్‌లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్త గ్రామంలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. తాత, నాయనమ్మ, తండ్రి, తల్లి, 10 నెలల శిశువు కూడా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు సంప్రదాయబద్ధంగా నౌల్త గ్రామానికి చేరుకుంది. హత్యకు గురైన చిన్నారి మినహా మిగతా వారంతా ఊరేగింపుతో ముందుకు నడిచారు. ఆ కొద్దిసేపటికే, బాలిక కనిపించడం లేదంటూ చిన్నారి తండ్రికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో, అంతా షాక్‌గకు గురయ్యారు. అంతా కలిసి వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఒక గంట తర్వాత, చిన్నారి నాయనమ్మ బంధువు ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న ఒక స్టోర్‌రూమ్ తలుపు తెరిచింది. బయట నుంచి గడియ పెట్టి ఉన్న ఆ గది ఓపెన్ చేయగానే, చిన్నారి విగతజీవిగా కనిపించింది. తల నీటి తొట్టెలో మునిగిపోయి, పాదాలు నేలపై ఆనుకుని ఉన్న స్థితిలో చిన్నారి కనిపించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ, చిన్నారి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇది హత్యేనని భావించిన చిన్నారి తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసు పూనమ్ హత్య చేసినట్టుగా గుర్తించారు. చిన్నారికి హంతకురాలు అత్త అవుతుందని తెలిపారు. అందంగా ఉన్న పిల్లలపై అసూయ, కోపంతో వారిని నీటిలో ముంచి చంపే ఒక భయంకరమైన మనస్తత్వం ఆమెదని, ఎవరూ తనకంటే అందంగా కనిపించకూడదనే ఆమె భావనే ఇందుకు కారణమని వివరించారు.
ముద్దుగా ఉండే బాలికలను లక్ష్యంగా చేసుకుందని, ఇప్పటివరకు మొత్తం నలుగుర్ని హత్య చేయగా, అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఒకరు తన సొంత కొడుకు ఉన్నారని, హత్య చేసినట్టుగా ఆమె ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలన్నీ ఒకే రకంగా జరిగాయన్నారు. 2023లో తన మరదలి కూతురిని పూనమ్ చంపిందని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, అదే ఏడాది తన సొంత కొడుకుని కూడా నీటిలో ముంచి చంపిందని వివరించారు. ఈ సంవత్సరం ఆగస్టులో ఓ చిన్నారి ‘చాలా అందంగా’ ఉందని భావించి హత్య చేసిందని పేర్కొన్నారు. పూనమ్ నిజం ఒప్పుకోవడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. లేదంటే, ఈ నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తూ చనిపోయారని అందరూ భావించారు.
Read Also- Kokapet Land Auction: మరోసారి కోట్లు పలికిన కోకాపేట భూములు.. 4 ఎకరాలకు రూ.524 కోట్లు
