Fake Liquor: మందు బాబుల పుణ్యమా అని ప్రభుత్వాలు నడుస్తుంటాయి. ఇది కాస్త కామెడీగా అనిపించినా నిజం. ఏ రాష్ట్రం చూసినా మద్యం ఏరులై పారుతుంటుంది. సర్కారు (Govt) ఆర్థిక కష్టాలకు మద్యం ధరలే టానిక్. కానీ, కొందరు కల్తీగాళ్ల పనులకు అటు ప్రభుత్వానికి, ఇటు మందు బాబుల ఆరోగ్యానికి, జేబులకు నష్టం జరుగుతున్నది. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు, ఓవైపు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూనే ఇంకోవైపు అధిక ధరలు ఉండే బాటిళ్లలో తక్కువ రేటు ఉండే లిక్కర్ కలుపుతూ దండుకుంటున్నారు. లింగంపల్లి (Lingampally) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏకంగా బార్‌లోనే ఈ వ్యవహరం జరుగుతున్నది.
ఆకస్మిక తనిఖీతో గుట్టంతా బయటకు..
అయ్యప్ప సొసైటీ గురించి మీ అందరికీ తెలుసు. అటు మాదాపూర్ (Madhapur), ఇటు హైటెక్ సిటీ (Hitech City)కి మధ్యలో ఉంటుంది. ఇలాంటి ఏరియాలో బార్ అంటే రేట్లు మామూలుగా ఉండవు. అలాంటిదే ట్రూప్స్ బార్ (Troops Bar). కాస్ట్లీ ఏరియా కావడంతో ఇక్కడ రేట్లు కూడా కాస్ట్లీగానే ఉంటాయి. అంతేకాదండోయ్, ఇక్కడ కల్తీ కూడా యమ కాస్ట్లీ. కొన్నాళ్లుగా ఈ బార్ మద్యం డిపోల నుంచి బాటిల్స్‌ను కొనుగోలు చేయకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎక్సైజ్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. దీంతో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ట్రూప్స్ బార్ నిర్వహణ టైమ్ అయిపోయినా రెన్యువల్ చేయించుకోలేదు. పైగా, మద్యం కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు నిర్వాహకులు.
రూ.వెయ్యికి రూ.1500 లాభం
అధికారుల తనిఖీ సమయంలో కూకట్ పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ అనే ఇద్దరు కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసేసి, తక్కువ ధరలు ఉన్న మద్యాన్ని వాటిలో కలుపుతూ కనిపించారు. సాధారణంగా జెమ్‌సన్ బాటిల్ 2,590 రూపాయలు ఉంటుంది. కానీ, వీరు అదే బాటిల్‌లో ఓక్స్‌మిత్(ధర రూ.1000) మద్యాన్ని కలుపుతున్నారు. అంటే, వెయ్యికి ఇంకో 1500 లాభం అన్నమాట. బార్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు మరిన్ని విషయాలు తెలిశాయి. ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ దొరికాయి. కల్తీ మద్యం కలిపిన 75 బాటిల్స్‌ను, 55 ఖాళీ బాటిల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
లైసెన్స్ ఫీజు చెల్లించకుండానే..
చాలాకాలంగా ట్రూప్స్ బార్ లైసైన్స్ ఫీజు చెల్లించలేదు. అంతేకాకుండా మద్యం డిపోల నుంచి కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదు. తక్కువ ధరలతో ఉండే మద్యాన్ని కాస్ట్లీ బాటిల్స్‌లో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నది. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.1.48 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ బార్ లైసెన్స్ ఓనర్ ఉద్యా కుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, అక్కడ పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న నకిలీ మద్యాన్ని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్ వెల్లడించారు.
స్పందించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
ఈ కల్తీ మద్యం ఆపరేషన్‌లో ఏఈఎస్‌తోపాటు సీఐ సుభాష్ చందర్ రావు, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ సుధాకర్, కిషన్, శ్రీనివాస్, సుదీప్ రెడ్డి, దుర్గ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు. ఎవరైనా ఇలా కల్తీ మద్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Ghatkesar VBIT Hostel: హైదరాబాద్ హాస్టల్ లో ఘోరం.. యువతుల న్యూడ్ వీడియోలు వైరల్?