Attempt Murder: వరంగల్‌లో సంచలనంగా మారిన డాక్టర్ గాదె సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన అనూహ్య మలుపు తిరిగింది. సుమంత్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు కుట్ర పన్నింది. అనంతరం ఏమీ తెలియనట్టు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న భర్తతో పాటు ఆస్పత్రిలో ఉంది. అసలు విషయం బయటపడటంతో ఆస్పత్రి నుంచి ఉడాయించి, ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన ఇప్పుడు వరంగల్ మహానగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రేమించి పెళ్లి చేసుకొని..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట సిద్దార్ధనగర్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుమంత్ రెడ్డి ఫ్లోరా అనే యువతిని ప్రేమించి కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సుమంత్ రెడ్డి సంగారెడ్డిలో కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా పని చేశాడు. అక్కడే ప్రయివేట్ టీచర్‌గా పని చేస్తున్న భార్య ఫ్లోరా సమీపంలోని జిమ్‌కి వెళ్లేది. ఆ సమయంలో సామెల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలియడంతో సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరాని మందలించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. కొన్ని రోజుల తర్వాత సంగారెడ్డి నుంచి భార్యాభర్తలు వరంగల్‌కు షిఫ్ట్ అయ్యారు. సుమంత్ రెడ్డి కాజీపేటలో క్లినిక్ పెట్టుకుని నిర్వహిస్తున్నాడు. ఫ్లోరా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నది. వివాహేతర సంబంధానికి సుమంత్‌ని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సామెల్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. సుపారీ ఇచ్చి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసింది.
హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..
డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసేందుకు గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసే రాజుతో కలిసి సామెల్ ప్లాన్ చేశాడు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేశారు. గురువారం రాత్రి విధులు ముగించుకుని వెళ్తుండగా అమ్మవారిపేట సమీపంలో సుమంత్ రెడ్డి కారును వెంబడించి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని అతడిపై ఇనుప రాడ్డుతో అమానుషంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మృతిచెంది ఉంటాడని భావించి, అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసు బ్రెయిన్‌తో తప్పించుకొనే ప్రయత్నం..
సుమంత్ రెడ్డిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఏఆర్ కానిస్టేబుల్ రాజు పోలీస్ బ్రెయిన్‌తో ప్లాన్ వేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా హత్యా ప్రయత్నం చేసిన వారు ఎవరో గుర్తుపట్టకుండా హెల్మెట్లు ధరించి రాడ్లతో సుమంత్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దాడిచేసి అక్కడ నుంచి పారిపోయారు. చివరికి కాల్ డాటా ఆధారంగా, మహారాష్ట్రలో తలదాచుకున్న శామ్యూల్, కానిస్టేబుల్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తున్నది.