Warangala Collector Pravinya
క్రైమ్

Cyber Crime: వరంగల్ కలెక్టర్ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి.. సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ

Warangala Collector Pravinya: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. మోసాలూ అదే విధంగా ఎవాల్వ్ అవుతున్నాయి. ఫోన్లు చేసి.. మెస్సేజీల్లో లింకులు పెట్టి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేసే ఘటనలు మొదలు.. ఇప్పుడు ఏకంగా వాట్సాప్‌లో నేరుగా తమ మిత్రుల వలే మెస్సేజీలు చేసి మనల్ని మనమే చేజేతులా మోసం చేసుకునే మోసాలు పన్నుతున్నారు. మంచి హోదా ఉన్న వ్యక్తి ఫొటోను డీపీగా పెట్టుకుని ఆయనే తన మిత్రులు, లేదా సహ ఉద్యోగులకు వాట్సాప్ మెస్సేజీ చేసి డబ్బులు అడిగినట్టుగా చాట్ చేస్తున్నారు. అదీ ఆషామాషీ వ్యక్తులను కాదు.. కలెక్టర్, డీజీపీ స్థాయి వ్యక్తుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని వాట్సాప్ మెస్సేజీలో డబ్బులు కావాలని అడుగుతున్న ఘటనలు బయటికి వచ్చాయి. మొన్నటికి మొన్న డీజీపీ ఫొటోను డీపీగా పెట్టుకుని ఓ సైబర్ మోసగాడు డబ్బు దండుకోవడానికి ప్రయత్నించగా.. తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఫొటోను డీపీగా పెట్టుకుని మోసానికి యత్నించాడు.

వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకూ సైబర్ కేటుగాళ్ల బెడద తప్పలేదు. ఈ సైబర్ నేరగాళ్లు ప్రావీణ్య పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను క్రియేట్ చేశారు. వాట్సాప్ ఖాతాను సృష్టించారు. ఆ వాట్సాప్ నెంబర్‌పై కలెక్టర్ ప్రావీణ్య ఫొటోను డీపీగా పెట్టారు. ప్రొఫైల్‌లో పేరు కూడా ప్రావీణ్య అని కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తన కొలిగ్స్ కొందరికి కలెక్టర్ ప్రావీణ్యనే మెస్సేజీలు పంపినట్టుగా చాటింగ్ చేశారు. ‘హలో.. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని మాట కలిపి.. ‘నేను ఇప్పుడు ఎక్కువ ఫోన్ కాల్స్ తీసుకోలేని ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నాను. ఈ సమయంలో మీరు ఒక సహాయం చేయాలి’ అని అభ్యర్థించారు. డబ్బులను తాను చెప్పిన ఫోన్ పే చేసి, ఆ తర్వాత పంపినట్టుగా స్క్రీన్ షాట్స్ తీసి తనకు పెడితే ఆ డబ్బులు తర్వాత తిరిగి ఇచ్చేస్తాననీ మెస్సేజీలు పెట్టారు.

ఇలా కలెక్టర్ సహొద్యోగులు, ఆమెకు తెలిసిన మరికొందరికి మెస్సేజీలు పెట్టినట్టు తెలిసింది. అధికారుల నుంచే ఈ కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేశారు. ఈ విషయం కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి వచ్చింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వరాదని ఆమె విజ్ఞప్తి చేశారు.

వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో మోసం చేయాలనుకున్న కేటుగాళ్లు అందుకు శ్రీలంక నెంబర్ (+94776414080)ను ఉపయోగించారు.

ఇటీవలే ఏకంగా డీజీపీ ఫొటోను ఉపయోగించి మోసాలకు పాల్పడాలని కొందరు సైబర్ ఫ్రాడ్‌స్టర్లు చేసిన ప్రయత్నాలు బయటికి వచ్చాయి.ఓ వ్యాపారవేత్త కూతురికి ఫోన్ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ కాల్ చేసి డీజీపీ పేరుతో డ్రగ్స్ కేసులో నిన్ను అరెస్ట్‌ చేస్తామని డ్రగ్స్‌ నుండి తప్పించేందుకు 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు అగంతకుడు. దీంతో అనుమానం వచ్చి వ్యాపారవేత్త చీటింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశాడు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారస్తుడికి +92 కోడ్‌తో వచ్చిన వాట్సాప్‌ కాల్‌ ఇది. ఈ నెంబర్‌ని పరిశీలించిన అనంతరం పాకిస్తాన్ కోడ్‌ అంటున్నారు సైబర్ పోలీసులు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు