VC Janardhan Rao | హైదరాబాద్ పంజాగుట్టలో దారుణ హత్య జరిగింది. సొంత మనవడే తాతను అత్యంత కిరాతకంగా మర్డర్ చేసిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అడ్డొచ్చిన తల్లిపై కూడా కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… పంజాగుట్టకి చెందిన పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు (VC Janardhan Rao)ను మనవడు కీర్తి తేజ దారుణంగా హత్య చేశాడు. 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సరోజినీ దేవిని కూడా.. కన్నతల్లి అనే జాలి లేకుండా కత్తితో 6 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరోజినీ దేవి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. బీమా జువెలరీస్ దగ్గర కీర్తి తేజను అదుపు లోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు రిమాండ్ కి తరలించారు.
వీసీ జనార్దన్ రావుకి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని హత్య చేసింది రెండవ కుమార్తె అయిన సరోజినీ దేవి కుమారుడు కీర్తి తేజ. కాగా, కీర్తి తేజ 2018 లో అమెరికా నుండి హైదరాబాద్ కి తిరిగివచ్చాడు. జనార్దన్ రావుకు పాశ మైలారం, బాలానగర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో వెల్జాన్ గ్రూప్ కంపెనీలు ఉండగా… పాశ మైలారంలో ఉన్న వెల్జాన్ కంపెనీలో కీర్తి తేజ పని చేస్తున్నాడు.
ఇటీవల జనార్దన్ రావు (VC Janardhan Rao) తన పెద్ద కుమార్తె కుమారుడు శ్రీకృష్ణని పాశమైలారం కంపెనీకి డైరెక్టర్ ని చేశారు. కీర్తి తేజ పేరిట నాలుగు కోట్ల షేర్స్ ని బదిలీ చేశారు. అయితే తనని కంపెనీకి డైరెక్టర్ ని చేయకపోవడంతో కోపం పెంచుకున్న కీర్తి తేజ… తాతతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం తల్లి సరోజినీ దేవితో సోమాజిగూడలోని జనార్దన్ రావు నివాసానికి వెళ్లిన కీర్తి తేజ… మరోసారి ఆస్తుల వ్యవహారంపై తాతతో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో తండ్రికి టీ తీసుకురావడానికి సరోజినీ దేవి కిచెన్ లోకి వెళ్లగా.. ఇది అదునుగా భావించిన కీర్తి తేజ తాతపై కత్తితో దాడికి దిగాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లిని సైతం కత్తితో పొడిచాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనవడే జనార్దన్ రావుని హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు శనివారం భీమా జువెలర్స్ వద్ద అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. జనార్దన్ రావు శరీరంపై 73 కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కీర్తి తేజ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డ్రగ్స్ టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించారు.