BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ కేసులో కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుండగా అధికారులు ఆమెను తిహార్ జైలు నుంచే వర్చువల్ మోడ్‌లో రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఆమె కస్టడీని మరికొన్ని రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ అధికారులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేజ్రీవాల్ బెయిల్ తీర్పుపై హైకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్ర కీలకంగా ఉన్నదని ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. తొలుత సాక్షిగా పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఈ కేసులో కవితనే కింగ్‌పిన్ అని ఆరోపించింది. మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కేసులో విచారించిన తర్వాత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో కవిత ఉన్నారు. సీబీఐ కూడా ఆమెను తిహార్ జైలు నుంచే కస్టడీలోకి తీసుకుని విచారించింది.