Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఆమె కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారం ముగియడంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోరారు.
దీంతో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. అదే తేదీకి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపైనా అదే రోజు విచారణ జరగనుంది.
కాగా, కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తాను చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరారు. కవిత అభ్యర్థనకు రౌస్ అవెన్యూ కోర్టు అంగీకారం తెలిపింది.