– మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి
– గన్‌తో బెదిరించి మరీ దారుణం
– కేసు నమోదు.. సస్పెన్షన్.. అరెస్ట్
– ఎస్సై భవాని సేన్ గౌడ్‌పై సీఎం రేవంత్ సీరియస్
– సర్వీస్ నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశం
Bhupalpally SI Sexual Assault On Woman Constable Case Registered Against: కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనే సినిమా డైలాగ్ బాగా ఫేమస్. కానీ, కొందరు పోలీసుల వల్ల ఆ శాఖకు ఎన్నో మరకలు అంటుకుంటున్నాయి. తాజాగా ఓ ఎస్సై చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఒళ్లు మరిచి, నీతి తప్పి దారుణానికి ఒడిగట్టాడు. తన రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషినని చెప్పుకుని సిబ్బందిని బెదిరిస్తున్నాడు. పోలీస్ శాఖలో ఈ కలుపు మొక్క ఎవరో కాదు కాళేశ్వరం ఎస్సైగా పని చేస్తున్న భవాని సేన్ గౌడ్.
అసలేం జరిగింది?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నాడు భవాని సేన్ గౌడ్. తన ఇంటికి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నానని చెప్పాడు. వచ్చి సాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి అత్యాచారం చేశాడు. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషినని, తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశాడు. బాధిత మహిళా కానిస్టేబుల్ ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కీచక పోలీస్ బండారం బయటపడింది. తనకు మాయమాటలు చెప్పి ఎస్సై లొంగదీసుకున్నాడని వాపోయింది బాధితురాలు.
Also Read: డీజే సిద్ధూ.. వీని స్టయిలే వేరు!
గతంలోనూ సస్పెన్షన్ వేటు
ఎస్సై భవాని సేన్ గౌడ్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక చోట నుండి పావు కిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేసేవాడని, ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను సైతం విడిచిపెట్టకుండా జేబులో రూ.100 ఉన్నా కూడా వదలకుండా అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ బెదిరించేవాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించిందుకు ఒకసారి సస్పెండ్ అయినట్లు కూడా తెలుస్తోంది.
సీఎం సీరియస్.. ఎస్సై అరెస్ట్
తాజా ఘటన కారణంగా ఎస్సైపై కేసు నమోదు చేశారు ఉన్నతాధికారులు. మరోసారి సస్పెన్షన్ వేటు వేసి అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా కానిస్టేబుల్‌తో సహా స్థానికులు సైతం కోరుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సైపై సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు.