సోమాజిగూడలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, వెల్జాస్ సంస్థల అధినేత వెలమాటి జనార్ధన్ రావు (Janardhan Rao) హత్య సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జనార్ధన్ రావు మీద కీర్తితేజ్ క్తతితో దాడి చేసినట్టు చెప్పారు. గురువారం రాత్రి పంజాగుట్టలో హత్య జరిగితే తమకు 100 డయల్ ద్వారా సమాచారం వచ్చిందని.. పోలీసులు వెళ్లేసరికే జనార్ధన్ రావు చనిపోయి ఉన్నట్టు వివరించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం… జనార్ధన్ రావుకు (Janardhan rao) ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కొడుకు శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీ డైరెక్టరుగా జనార్ధన్ రావు నియమించారు. చిన్న కుమార్తె కొడుకు కీర్తితేజ్ పేరిట రూ.4 కోట్ల షేర్లు రాశారు. . ఈ క్రమంలోనే కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. జనార్ధన్ రావుతోనే సరోజిని దేవి, అతని కుమారుడు ఉంటున్నారు. గురువారం రాత్రి కీర్తితేజ్ తాతతో ఆస్తి కోసం వాదించాడు. టీ తీసుకురావడం కోసం సరోజిని దేవి ఇంట్లోకి వెళ్లారు. అదే అదునుగా భావించిన కీర్తితేజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
అరుపులు వినపడటంతో ఇంట్లో నుంచి సరోజినిదేవి వచ్చి అడ్డుకోబోయింది. దాంతో తన తల్లిపై కూడా కీర్తి తేజ్ దాడికి పాల్పడ్డాడు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంట్లో ఉన్న హెల్పర్ అడ్డుకోవడానికి వస్తే.. రావొద్దంటూ బెదిరించాడు కీర్తి తేజ్. జనార్ధన్ రావు ఒంటిపై చాలా కత్తిపోట్లు ఉన్నాయి. జనార్దన్ రావు (Janardhan rao) కొడుకు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. కీర్తి తేజను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణంగా ప్రాథమిక అంచనా వేశాం. తన కొడుకు కీర్తితేజ్ తన తండ్రిని హత్య చేసినట్టు సరోజిని దేవి స్టేట్ మెంట్ ఇచ్చింది.. కీర్తితేజ్ అమెరికాలో ఎమ్ ఎస్ చదువుకుని వచ్చాడని ఏసీపీ మోహన్ కుమార్ వివరించారు. కేసు విచారణ చేస్తున్నామని.. త్వరలోనే మరిన్ని విషయాలు బయటకొస్తాయని మోహన్ కుమార్ తెలిపారు.
