– రాధా కిషన్ రావు బాగోతాలెన్నో..!
– టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అడ్డాగా బెదిరింపులు
– రాధా కిషన్ రావుపై వరుసగా ఫిర్యాదులు
– బయటకొస్తున్న గత పాపాలు
– కొత్తగా మరో కేసు నమోదు
– ఇప్పటికే కూకల్ పల్లి పీఎస్‌లో కేసు
– సీఎం రేవంత్ రెడ్డికి మరో బాధితుడి ఫిర్యాదు
– ట్యాపింగ్ కేసులో 12 వరకు రిమాండ్ పొడిగింపు
Another Case File On Radha Kishan Rao(Today news in telangana): టాస్క్ ఫోర్స్.. ఈ పేరు వింటే నేరస్థులకు వణుకు. హైదరాబాద్ మహా నగరంలో రౌడీయిజం, మాఫియా, మతపరమైన ఉద్రిక్తతలను అదుపు చేయడానికి ప్రత్యేక దళంగా ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. లా అండ్ ఆర్డర్ అంశంలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, కొందరు పోలీసులు ఈ వ్యవస్థకు మాయని మచ్చ తెస్తున్నారు. దానికి ఉదాహరణే రాధా కిషన్ రావు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఈయన చేసిన అక్రమాలన్నీ ఒక్క అరెస్ట్‌తో బయటకొస్తున్నాయి. బాధితులంతా వరుసబెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు రాధా కిషన్ రావు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని బట్టి రాధా కిషన్ రావును ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. విచారణ జరిపి కీలక సమాచారం రాబట్టింది. అయితే, కస్టడీ ముగియడంతో ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, ఈనెల 12 వరకు రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కోర్టుకు కంప్లయింట్ చేశారు రాధా కిషన్. జైలులో లైబ్రరీకి వెళ్లనివ్వడం లేదని, సూపరింటెండెంట్‌ను కూడా కలవనివ్వడం లేదని చెప్పారు. దీంతో పోలీసులను పిలిచి ప్రశ్నించింది నాంపల్లి కోర్టు. లైబ్రరీతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేలా అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.
కొత్తగా మరో కేసు
ఒకే ఒక్క ట్యాపింగ్ కేసుతో రాధా కిషన్ రావు బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అడ్డాగా సాగించిన వ్యవహారాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఎవరెవరిని బెదిరించి పనులు చేయించింది, తనుకు అనుకూలమైన వారికోసం ఎలా పని చేసిందీ, ఇలా చేసిన పాపాలన్నింటినీ బాధితులు ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. వేణుమాధవ్ అనే బాధితుడు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఈ ఫిర్యాదు చేశాడు. తనను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాధా కిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపైనా ఫిర్యాదు చేశాడు. దీంతో రాధా కిషన్, ఎస్ఐ మల్లికార్జున్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ వేణుమాధవ్ చెన్నుపాటి వద్ద నుంచి బలవంతంగా షేర్లు మార్పిడి చేయించారు. 2018 నవంబర్‌లో టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌లోనే సంతకాల తతంగం నడిచింది. తాజాగా రాధా కిషన్ రావు అరెస్ట్ కావడంతో ధైర్యం చేసి ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు వేణు మాధవ్.
ఇప్పటికే కూకట్ పల్లి పీఎస్‌లో కేసు
ఈనెల 3న రాధా కిషన్ రావుపై సుదర్శన్ అనే వ్యక్తి కూకట్ పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. గతంలో తనను బెదిరించి ఓ ఫ్లాట్‌ను బలవంతంగా రాయించుకున్నాడని అందులో పేర్కొన్నాడు. సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లిన మరో ఫిర్యాదు
శరణ్ చౌదరి అనే వ్యక్తి కూడా రాధా కిషన్ రావుపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే ఫిర్యాదు చేశాడు. 2023 ఆగస్టు 21న సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు తనను కిడ్నాప్ చేసి రాధాకిషన్ రావు, ఉమామహేశ్వరరావు దగ్గరకు తీసుకెళ్లారని చెప్పాడు. తనపై అక్రమ కేసు పెట్టి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బంధువుకి తన ఫ్లాట్‌ను బలవంతం రాయించారని వాపోయాడు. అంతేకాదు, తన కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చి రూ.50 లక్షల దాకా తీసుకున్నారని ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు.
ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై నిఘా
టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అడ్డాగా రాధా కిషన్ రావు సాగించిన లీలలన్నీ వెలుగుచూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఇటు ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఎన్నికల సమయంలో డబ్బుల తరలింపు, ప్రతిపక్షాల నగదు సీజ్ చేయడంలో సూత్రధారిగా ఉన్నాడు రాధా కిషన్ రావు. ఈ నేపథ్యంలో ఇంకా ఇలాంటివెన్ని చేసి ఉంటారో అని పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.