AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు దిగజారిపోయాయని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ గురుమూర్తి, తనుజారాణి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో గురుమూర్తి మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.‘ హరికృష్ణపై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్‌పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని గురుమూర్తి వ్యాఖ్యానించారు.
Read Also- Viral Video : దువ్వాడ- మాధురి రొమాన్స్.. బద్ధలవుతున్న సోషల్ మీడియా
తీవ్రమైన అఘాయిత్యాలు
ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. వైసీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని తనుజా రాణి ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఎంపీలు ఇద్దరు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పోలీసులు మాత్రం తాము తమ విధులు నిర్వర్తిస్తున్నామని.. తామెవరినీ టార్గెట్ చేయట్లేదని చెబుతున్నారు.
లీగల్ సెల్ పనితీరు అద్భుతం..
తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు. శుక్రవారం గుంటూరులో జిల్లా వైసీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులో బనాయిస్తోందని మండిపడ్డారు. ‘ ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని అంబటి ప్రశంసించారు.
Read Also- Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ.3వేలు