YS Viveka Murder Case: పులివెందుల స్వేచ్ఛ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు శనివారంతో (మార్చి 15) ఆరేళ్లు పూర్తయ్యాయి. కేసులో ఇప్పటికీ పురోగతి లేకపోవడంతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‍ను వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి కలిశారు. తన తండ్రి హత్య కేసుపై గవర్నర్‍కు ఆమె ఫిర్యాదు చేశారు. తన తండ్రిని అతి కిరాతంగా హత్య చేశారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. విజయవాడలోని రాజ్ భవన్‍కు గవర్నర్‌తో ఆమె మాట్లాడారు.
మరోవైపు, ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని వివేకా కుమార్తె వైఎస్ సునీత సందేహాలు వ్యక్తం చేశారు. సాక్షులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె కోరారు. ఈ కేసులో విచారణ జరగడం లేదని, ట్రయల్స్ కూడా మొదలుకాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య కేసులో ఒక్కరు మినహా మిగతా నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె వాపోయారు. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాడుతున్నామని, అసలు ఈ కేసులో న్యాయం జరుగుతుందా? అని ఆమె నైరాశ్యం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారనే సందేహం కలుగుతోందని ఆమె చెప్పారు. ఈ కేసులో నిందితుల కంటే బాధితులైన తమకే ఎక్కువ శిక్ష పడుతున్నట్లుగా అనిపిస్తోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శనివారం పులవెందులలోని సమాధి వద్ద నివాళులు అర్పించి, ప్రార్థన నిర్వహించారు. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మతో పాటు వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ సునీత మీడియాతో మాట్లాడారు.
సీబీఐ విచారణ మళ్లీ మొదలవ్వాలి
వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ మళ్లీ విచారణ మొదలుపెట్టాలని తాను భావిస్తున్నట్టు వైఎస్ సునీత చెప్పారు. సాక్షుల మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన ఆమె, సాక్షులతోపాటు నిందితులను కూడా కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలంటూ సాక్షులపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Also Read: Social Media: ఏపీ దారిలో తెలంగాణ.. ఇక అలా చేస్తే కటకటాలే
ఈ హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగడంలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మార్చి 15న తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. హత్యకు ముందురోజు జమ్మలమడుగు ప్రాంతంలో వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. నాటి నుంచి కేసుపై విచారణ జరుగుతూనే ఉంది.